కారుకు సైడ్ ఇవ్వలేదని ఆర్టీసీ బస్సు డ్రైవర్ ను చితకబాదాడు ఓ వ్యక్తి..బస్సును ఆపీ మరీ ఆ డ్రైవర్ పై పిడిగుద్దులు గుద్దుతూ..కాలితో తన్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అసలేం జరిగిందంటే.. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల దగ్గర సిరిసిల్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వెనకాల పిట్టల శ్రీకాంత్ అనే వ్యక్తి కారులో వస్తున్నాడు. సైడ్ ఇవ్వలేదనే కారణంతో బస్సును చేజ్ చేసి ఆపీ మరీ ఆర్టీసీ బస్ డ్రైవర్ బాలరాజును కాలితో తన్ని చితకబాదాడు కారు డ్రైవర్ శ్రీకాంత్ . ప్రయాణికుల ఎదుటే బస్ డ్రైవర్ బాలరాజును చితక్కొట్టాడు. దీంతో ఆర్టీసీ డ్రైవర్ బాలరాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న కారు డ్రైవర్ శ్రీకాంత్ ను పట్టుకునే పనిలో ఉన్నారు.
మరో వైపు ఈ ఘటనపై రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు. విధుల్లో ఉన్న ఆర్టీసీ ఉద్యోగిపై ఉద్దేశ్య పూర్వకంగా దాడి చేయడం హేయమైన చర్య అని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ తో మంత్రి పొన్నం ప్రభాకర్ ఫోన్ లో మాట్లాడారు. ఆర్టీసీ డ్రైవర్ పై దాడి చేసిన వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజా రవాణా వ్యవస్థలో ప్రయాణికుల కోసం నిరంతరం శ్రమిస్తున్న ఆర్టీసీ సోదరులపై దాడి ఉపేక్షించేది లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటామని ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ మనోధైర్యాన్ని ప్రకటించారు.
