- ఐదు నెలల తర్వాత జిల్లాకు పూర్తి స్థాయి కలెక్టర్
రాజన్నసిరిసిల్ల, వెలుగు: రాజన్నసిరిసిల్ల జిల్లా కలెక్టర్‌గా గరిమా అగ్రవాల్ నియమితులయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం గురువారం 45 మంది ఐఏఎస్‌లను బదిలీ చేసింది. దీనిలో భాగంగా జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌గా ఉన్న ఆమెకు పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించింది. కాగా గరిమా అగ్రవాల్ ఐదు నెలలుగా ఇన్‌చార్జిగా కొనసాగుతున్నారు. గతంలో ఇక్కడ కలెక్టర్‌గా పనిచేసిన సందీప్‌కుమార్ ఝా పలు వివాదాల మధ్య బదిలీ అయ్యారు.
ముఖ్యంగా సెప్టెంబర్ 17న విమోచన వేడుకల్లో ప్రొటోకాల్ పాటించలేదన్న ఆరోపణలతో ఆయనను బదిలీ చేశారు. అనంతరం హరితను కలెక్టర్‌గా ప్రభుత్వం నియమించింది. ఆమె కొద్దిరోజులకే చైల్డ్ కేర్ లీవ్ పెట్టి వెళ్లారు. గతేడాది అక్టోబర్ 23న జిల్లాకు అడిషనల్ కలెక్టర్(స్థానిక సంస్థలు)గా గరిమా అగ్రవాల్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ హరిత లాంగ్ లీవ్ పెట్టడంతో గరిమాకు ఇన్‌చార్జి కలెక్టర్‌గా బాధ్యతలు అప్పగించారు.
లాంగ్ లీవ్ తర్వాత కలెక్టర్ హరిత వేరే శాఖకు సెక్రటరీగా వెళ్లడంతో గరిమా అగ్రవాల్ అలాగే కొనసాగుతున్నారు. కాగా ఆమె ఇన్‌చార్జి కలెక్టర్‌గా ఉండగానే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. ఎన్నికలను ఎలాంటి వివాదాలు లేకుండా పూర్తిచేశారు. దీంతో ప్రభుత్వం ఆమెకు పూర్తి స్థాయి బాధ్యతలు ఇచ్చినట్లు తెలుస్తోంది.
