చిలుకలగుట్టపై ఏం చేస్తమో చెప్పం 

చిలుకలగుట్టపై ఏం చేస్తమో చెప్పం 

రేపటి నుంచే మహాజాతర షురూ కానుంది. ఇందులో అమ్మవార్లను గద్దెలపైకి తెచ్చే సమయం కీలకమైనది. దీని కోసం కోట్ల మంది భక్తులు ఎదురుచూస్తున్నారు. ఈ అపురూప ఘట్టం మరో రెండు రోజుల్లో ఆవిష్కృతం కాబోతుండగా అమ్మవార్లను దోసిట్లో పట్టుకొచ్చే ప్రధాన పూజారులను ముట్టుకుంటే చాలు తమ జన్మ ధన్యమవుతుందని భావించే వారెంతో మంది ఉన్నారు. అసలు వనదేవతలను తీసుకువచ్చే పూజారులెవరు? ఎక్కడి నుంచి...ఎలా తీసుకువస్తారు? తెచ్చే ముందు ఏం చేస్తారు? జాతర తర్వాత వీరేం పని చేస్తారు? అనే విషయాలను సమ్మక్క, సారక్క ప్రధాన పూజారులు వెలుగుతో పంచుకున్నారు. 

ప్ర: ఏ జాతర నుంచి అమ్మవారిని తీసుకువస్తున్నారు?
జ: 2010 నుంచి తీసుకువస్తున్నా. ఈ ఏడాది తెస్తే ఏడోసారి కంప్లీట్​ అవుతుంది. 
ప్ర: అమ్మవారిని తీసుకువచ్చే ముందు చిలుకలగుట్టపై ఏం చేస్తారు.
జ: మా సంప్రదాయం ప్రకారం కొన్ని పూజలు చేస్తాం. అవి రహస్యం. చెప్పరానివి.
సమ్మక్కను గురువారమే ఎందుకు గద్దెపైకి తీసుకొస్తరు?
జ: సమ్మక్క తల్లి దొరికింది. పెండ్లి జరిగింది గురువారమే. అందుకే ఆ రోజు సాయంత్రం గద్దెలపైకి తీసుకొస్తాం.
ప్ర: గద్దెకు తీసుకువచ్చే క్రమంలో ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా?
జ: అమ్మవారిని తీసుకువచ్చేటప్పుడు భక్తులు నన్ను తాకే ప్రయత్నం చేస్తరు . అప్పుడు తోపులాట విపరీతంగా ఉంటది. కానీ నా చుట్టు నాలుగంచెల సెక్యూరిటీ పెడతారు. అమ్మ దయవల్ల ఇప్పటి వరకు నాకు ఏ ఇబ్బంది కలగలేదు.  
ప్ర: జాతర తరువాత ఏ పని చేస్తారు?
జ: వ్యవసాయం చేసుకుంట. ప్రతి గురువారం గుడిలో దీపం ముట్టిచ్చి పూజలు చేస్తం.
ప్ర: జాతరం టైంలో దీక్షలు చేస్తరా?
జ: మండమెలిగె పండుగ నుంచి నిండు జాతర పుర్తయి తిరుగువారం వచ్చే దాకా పూజారులందరం ఒక్కపొద్దులుంటం. 
ప్ర: మీరెంత మంది (వడ్డెలు) పూజారులున్నరు?
జ: ఐదుగురం వడ్డెలం ఉన్నం. నేను, చందా బాబురావు, ఎంపలి మహేశ్, సిద్దబోయిన మునీందర్​, సిద్దబోయిన లక్ష్మణ్​రావు.  
ప్ర: జాతరల సందర్భంగా తీరని సమస్యలేమైనా ఉన్నాయా?.
జ: భక్తులు వస్తారని స్థానిక రైతులు రెండు పంటలు వేయకుండా పొలాలు వదిలేస్తున్నారు. వారికి నష్ట పరిహారమివ్వాలి.
ప్ర: భక్తులకు ఏం చెప్పాలనుకుంటున్నారు?. 
జ: పొలాల్లో విడిది చేసే భక్తులు మందు తాగి సీసాలు అక్కడే పగలగొడుతున్నారు. దాని వల్ల పంటలు సాగుచేసుకునేప్పుడు రైతులకు గుచ్చుకుని గాయపడుతున్నరు. ఈ విషయాన్ని గమనించి అలాంటి పనులు చేయొద్దని కోరుకుంటున్నా.
 ప్ర: మేడారం ఏమైనా అభివృద్ధి జరిగిందా?.
జ: జాతర వచ్చినప్పుడే చేస్తున్నరు. మేడారం ఊరు, మా ఆదివాసీలు ఏ మాత్రం డెవలప్​కాలే.