ఆ శాసనం చుట్టే మేడారం యుద్ధ చరిత

ఆ శాసనం చుట్టే మేడారం యుద్ధ చరిత

వెలుగు ప్రతినిధి, మేడారం: మేడారంలో రెండేండ్లకోసారి జరిగే మహాజాతర పూర్వాపరాల గురించి, సమ్మక్క పరివారం అమరత్వం గురించి అనేక గాథలు ప్రచారంలో ఉన్నాయి. జానపద కథలు, ఆదివాసులు గానం చేసే కళారూపాలే చాలా కాలం ఆధారంగా నిలిచాయి. వీటి ప్రకారమే కప్పం కట్టలేదని ప్రతాపరుద్రుడి సైన్యం మేడారంపై దండెత్తిందని ఇన్నాళ్లు భావిస్తూ వవచ్చారు. కానీ సమ్మక్క తండ్రి మేడరాజు ప్రస్తావన ఉన్న వేయిస్తంభాల గుడి శాసనం ఆధారంగా చరిత్రను అంచనా వేస్తే దాడి చేసింది ప్రతాపరుద్రుడు కాదని, కాకతీయుల రాజు మొదటి రుద్ర దేవుడేనని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ చెబుతున్నారు. ఈ శాసనం గురించి ప్రముఖ శాసనాల పరిష్కర్త పీవీ పరబ్రహ్మశాస్త్రి కాకతీయుల శాసనాల్లో పేర్కొన్నట్లు గుర్తు చేశారు. పొలవాసను పరిపాలించిన రెండో మేడరాజు యుద్ధంలో ఓడిపోవడంతో ‘నీ బిడ్డను నాకివ్వు’ అని రుద్రదేవుడు అడిగాడని, అది ఇష్టం లేని మేడరాజు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు వెయ్యి స్తంభాల గుడి శాసనంలో ఉంది. ఓడిన రాజుల బిడ్డలు, చెల్లెళ్లను పెండ్లి చేసుకునే అలవాటు రుద్రదేవుడికి ఉందని, మహబూబ్ నగర్ లోని వడ్డెమానులో చోడరాజులను ఓడించి వారి చెల్లెలు పద్మావతిని ఇలాగే పెండ్లి చేసుకున్నాడని హరగోపాల్ చెప్పారు. ‘మేడరాజు జాడ కనుక్కుని, ఆయనకు ఆశ్రయమిచ్చిన పగిడిద్దరాజు మీద గంగాధర మంత్రితో  రుద్రదేవుడు దాడి చేయించి ఉంటాడు. రాజ్య విస్తరణకు అడ్డుగా ఉన్న కోయరాజ్యాన్ని లోబరచుకోవాలన్నది ఒక కారణమైతే, తనకు లొంగకుండా, అడిగినా బిడ్డనివ్వకుండా అడివిలో చేరి రాచగోండుల రాజ్యాన్ని విస్తరింపజేస్తున్నాడన్నది రెండో కారణం’ అని చెప్పుకొచ్చారు. యుద్ధంలో సమ్మక్క బిడ్డలు జంపన్న, సారలమ్మ పాల్గొని ఉంటే ఈ యుద్ధం 1190కి ముందో, వెనకో జరిగి ఉంటుందని ఒక అంచనా. ఆ తర్వాత 1195లో జైతుగితో యుద్దంలోనే రుద్రదేవుడు మరణించాడు.