- బస్తాకు రూ.80 అదనంగా వసూలు చేస్తున్న వైనం
కుంటాల, వెలుగు: కుంటాల మండలంలో కొందరు డీలర్లు యూరియాను అధిక ధరలకు అమ్ముతూ అందినకాడికి దండుకుంటున్నారు. ఫోన్ లో యాప్ ద్వారా యూరియాను బుక్ చేసుకున్న వివిధ గ్రామాలకు చెందిన రైతులు తమకు కేటాయించిన ఫర్టిలైజర్ డీలర్లు ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. ప్రస్తుతం మొక్కజొన్న, జొన్న, గోధుమ, వరి పంటల కోసం రైతులకు యూరియా అవసరం ఉండగా.. ఈ అవకాశాన్ని ఆసరాగా చేసుకొని డీలర్లు అక్రమ దందాకు పాల్పడుతున్నారు.
రాయితీ పోనూ రూ.270కు లభించాల్సిన యూరియా బస్తాను కొందరు డీలర్లు రూ.350 నుంచి రూ.370 వరకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. మరికొందరు బస్తాపై రూ.80 అదనంగా వసూలు చేస్తూ వివిధ కంపెనీల మందులను లింక్‌ల పేరిట అంటగడుతున్నారని రైతులు వాపోతున్నారు. మరికొంత స్టాక్ రాకముందే డబ్బులు వసూలు చేసి అధికారులకు సమాచారం లేకుండానే ఫర్టిలైజర్ యాప్‌లో స్టాక్ వివరాలను నమోదు చేస్తున్నారు.
కుంటాలలో ఒక డీలర్ గత మూడు రోజులుగా ఎక్కువ ధరలకు అమ్ముతున్న విషయాన్ని వ్యవసాయ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లామని, అయినా పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై నిర్మల్ డీఏవో ఆంజిప్రసాద్ ను వివరణ కోరగా.. కుంటాలలో ఒక డీలర్ అధిక ధరలకు అమ్ముతున్న విషయం తమ దృష్టికి వచ్చిందని, సెల్ ఐడీ బ్లాక్ చేసి విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. యూరియాను ఎక్కువ ధరలకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
