హైదరాబాద్: కరీంనగర్ మేయర్ పీఠంపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ మేయర్ రేసులో కాంగ్రెస్ పార్టీ ఉందని కుండబద్దలు కొట్టారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌ను దక్కించుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అందరిని కలుపుకుని మేయర్ పీఠం దక్కించుకునేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. నిజామాబాద్‌లో బీజేపీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో మేయర్ పోటీ నుంచి తప్పుకుని ప్రతిపక్షంలో ఉంటామని ఎంపీ ధర్మపురి అర్వింద్ చెప్పారు. అలాంటప్పుడు కరీంనగర్లో మెజార్టీ లేకున్నా మేయర్ అవుతామని బండి సంజయ్ ఎలా చెబుతారని ప్రశ్నించారు.
ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన బీజేపీని కాదని, అడ్డదారిన మేయర్ పదవిని లాక్కోవాలని చూస్తే ఒక్కొక్కరిని రోడ్లపై ఉరికిస్తామని.. కరీంనగర్లో ఆయా పార్టీల నేతలను తిరగనీయబోమని కేంద్ర మంత్రి బండి సంజయ్ హెచ్చరించడంపై పొన్నం మండిపడ్డారు. మెజార్టీ లేకపోయినా బీజేపీ ఇండిపెండెడ్లను కలుపుకోవడం అనైతికం కాదా..? అని ప్రశ్నించారు. బీజేపీకి స్పష్టమైన మెజారిటీ ఉంటే మేము అడ్డుపడడం లేదని.. మేము ఎవరికీ వ్యతిరేకం కాదు.. ఎవరిని పదవి నుంచి దింపే ప్రయత్నం చేయడం లేదన్నారు.
మేయర్ పీఠం కోసం బీజేపీ ఎలాంటి ప్రయత్నాలు చేస్తోందో మేం కూడా అలానే చేస్తామని.. మాది కూడా రాజకీయ పార్టీనేనని.. కచ్చితంగా రాజకీయాలు చేస్తామని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మేయర్, చైర్పర్సన్ పీఠం కోసం క్యాంప్ రాజకీయాలు కామన్ అని.. ఒక్క కరీంనగర్‌లోనే కొత్తగా క్యాంప్ రాజకీయాలకు తెరలేపలేదన్నారు. కార్పొరేషన్లలో ప్రజాస్వామ్యబద్ధంగా మేయర్‌ను ఎన్నుకుంటారని.. మేయర్ పీఠం ఏ పార్టీ దక్కించుకున్నా కాంగ్రెస్ ప్రభుత్వం తరుఫున కార్పొరేషన్ అభివృద్ధికి సహకరిస్తామని పేర్కొన్నారు. ఏమవుతుందో ఫిబ్రవరి 16న చూద్దామని అన్నారు.
కరీంనగర్ మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందనే అంశం స్టేట్ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. కరీంనగర్ కార్పొరేషన్‌లోని 66 డివిజన్లకు జరిగిన ఎన్నికలో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. కరీంనగర్ మేయర్ పీఠం చేజిక్కించుకోవాలంటే ఏ పార్టీకైనా 35 సీట్లు అవసరం. 30 సీట్ల కైవసం చేసుకుని బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ 14 స్థానాలను చేజిక్కించుకున్నది. బీఆర్‌ఎస్ 9 స్థానాల్లో, ఫార్వర్డ్‌బ్లాక్ 2 స్థానాల్లో, ఎంఐఎం 3 స్థానాల్లో, ఇండిపెండెంట్లు 8 స్థానాల్లో విజయం సాధించారు. దీంతో మేయర్ పీఠం కోసం బీజేపీ, కాంగ్రెస్ ప్రయత్నాలు మొదలుపెట్టాయి. మరీ కరీంనగర్ మేయర్ పీఠంపై ఏ పార్టీ జెండా రెపరెపలాడుతుందో తెలియాలంటే ఫిబ్రవరి 16 తేదీ వరకు ఆగాల్సిందే.
