వైజాగ్ మెట్రోకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!

వైజాగ్ మెట్రోకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!
  •     ఢిల్లీలో ఏడుగురు కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ 
  •     నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టుకు అనుమతి కోసం విజ్ఞప్తి  
  •     వెంటనే గోదావరి ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని వినతి  

న్యూఢిల్లీ, వెలుగు: వైజాగ్ మెట్రోకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలిసింది. ఈ విషయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ స్వయంగా తెలియజేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఢిల్లీ పర్యటనలో భాగంగా మంగళవారం కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, కుమార స్వామి, సీఆర్ పాటిల్‌‌, అశ్వినీ వైష్ణవ్, శివరాజ్ సింగ్ చౌహన్, మనోహర్ లాల్ ఖట్టర్ ఇతరులతో చంద్రబాబు వేర్వేరుగా సమావేశమయ్యారు.

కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఖట్టర్ తో భేటీ సందర్భంగా రాష్ట్రంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం కింద నిర్వహిస్తున్న స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలను సీఎం వివరించారు. వైజాగ్, విజయవాడ సిటీల్లో మెట్రో నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే, ఇందులో వైజాగ్ మెట్రోకు కేంద్రం అనుమతి ఇచ్చినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. అలాగే కేంద్ర జల శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ తో సమావేశమైన చంద్రబాబు.. పోలవరం–నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వాలని, సాంకేతిక, ఆర్థిక సాయం చేయాలని కోరారు. గోదావరీ జలాల పంపకం కోసం గోదావరి నీటి వివాదాల ట్రిబ్యునల్‌‌ను  ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎగువ కృష్ణాపై ఆల్మట్టి డ్యామ్ ఎత్తును పెంచేందుకు కర్నాటక చేస్తున్న ప్రయత్నాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశం సందర్భంగా టీటీడీ లడ్డూ వివాదం, కల్తీ నెయ్యి వంటి అంశాలను వివరించినట్లు తెలుస్తోంది. అలాగే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసిన చంద్రబాబు.. కేంద్ర బడ్జెట్ రివైజ్డ్ లో ఏపీకి కేటాయింపులు పెంచాలని కోరినట్లు తెలిసింది. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమార స్వామిని కలిసి వైజాగ్ ఉక్కు అంశంపై కూడా చర్చించినట్టు సమాచారం.