5 ఎకరాల వరకే రైతు బంధు ఇవ్వాలె

5 ఎకరాల వరకే రైతు బంధు ఇవ్వాలె

హైదరాబాద్: ఆగస్టు 15 నాటికి రాజకీయ నాయకులు స్వచ్ఛందంగా రైతు బంధు వదులుకోవాలని ఫార్మర్ ఫస్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు చక్రధర్ గౌడ్ డిమాండ్ చేశారు. చిన్న, సన్నకారు రైతులకు రైతు బంధు పథకం వరం అన్న ఆయన... రాజకీయ నాయకులకు కూడా పథకాన్ని అమలు చేయడం వల్ల ఉపయోగం లేదని తెలిపారు. ప్రజా ప్రతినిధులుగా ప్రభుత్వం నుంచి వేతనాలు, ఇతర అలవెన్స్ లు పొందుతున్న రాజకీయ నాయకులకు రైతు బంధు అవసరమా అని ప్రశ్నించారు. చివరకు విదేశాలలో సకల భోగాలు అనుభవిస్తున్న వారు సైతం రైతుబంధును తీసుకోవడం విడ్డూరమన్నారు. ఒక్క రోజు కూడా వ్యవసాయం చేయని వాళ్లు... వందల ఎకరాలకు రైతు బంధు పొందుతున్నారని మండిపడ్డారు. దీనివల్ల భూమినే నమ్ముకొని బతకుతున్న చిన్న, సన్నకారు రైతులకు తీవ్ర నష్టం కలుగుతోందని చెప్పారు.  కోట్లకు పడగలెత్తిన వాళ్లు కూడా రైతు బంధు డబ్బుల కోసం వెంపర్లాడటం సరికాదన్నారు. ప్రతి గుంటకు రైతు బంధు ఇవ్వడం వల్ల ఉపయోగం లేదన్న ఆయన... రైతు బంధు పథకాన్ని 5 ఎకరాల వరకే పరిమితం చేయాలన్నారు.

ఓ వైపు రైతులు ఆత్మహత్యకు పాల్పడుతోంటే... రైతు బంధు పేరిట ఏటా దాదాపు 6 వేల కోట్ల రూపాయల అవినీతి జరుగుతోందని ఆరోపించారు. తనకు పది ఎకరాల భూమి ఉందన్న ఆయన... తాను స్వచ్ఛందంగా రైతు బందు వదులుకున్నట్లు తెలిపారు. తనను చూసి ఓ మాజీ ఐఏఎస్ అధికారి, మంత్రి మల్లారెడ్డి కూడా రైతు బంధు వదులుకుంటామని అన్నారని తెలిపారు. వచ్చే ఆగస్టు 15 లోగా మంత్రి మల్లారెడ్డి తన మాట నిలబెట్టుకోవాలని చెప్పిన ఆయన... రాజకీయ నాయకులందరూ స్వచ్ఛందంగా రైతు బంధు వదులుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఫార్మర్ ఫస్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు.