RCB: భారీ వర్ష సూచన.. బెంగుళూరును భయపెడుతున్న వరుణుడు

RCB: భారీ వర్ష సూచన.. బెంగుళూరును భయపెడుతున్న వరుణుడు

వరుస విజయాలు సాధించి ప్లే ఆఫ్ రేసులో నిలబడిన బెంగుళూరు జట్టును వరుణుడు భయపెడుతున్నాడు. మే 18న బెంగుళూరులోని చిన్నస్వామి వేదికగా డుప్లెసిస్ సేన.. చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. ప్లే ఆఫ్ రేసును నిర్ణయంచే ఈ కీలక పోరుకు వర్షం ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ నివేదికలు వస్తున్నాయి.

నివేదికల ప్రకారం.. మే 18న పగటిపూట 73 శాతం వర్షం కురిసే అవకాశాలు ఉండగా.. అది సాయంత్రం 6 గంటల సమయంలో 80 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. దీంతో మ్యాచ్ పూర్తవవుతుందా...! లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ వరుణుడు కనికరిస్తే ఐపిఎల్ నిబంధనల ప్రకారం.. ఫలితాన్ని నిర్ణయించడానికి ఐదు ఓవర్ల గేమ్ నిర్వహిస్తారు. ఇది రాత్రి 10:56 గంటలకు ప్రారంభమవుతుంది. ఆ సమయంలోనూ ప్రతికూల వాతావరణం ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

ఈ మ్యాచ్‌పై ఇరు జట్ల భవిష్యత్తు ఆధారపడి ఉంది. చెన్నై గెలిస్తే ప్లే ఆఫ్ బెర్త్ ఖరారై.. రేసు నుంచి బెంగుళూరు నిష్క్రమిస్తుంది. అదే సమయంలో ఆర్సీబీ ప్లే ఆఫ్ చేరాలంటే భారీ తేడాతో గెలవాలి. తద్వారా చెన్నై కంటే నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉంటుంది. ఇది జరిగాక కూడా వారు ఇతర జట్ల ఫలితాలపైనే ఆధారపడాల్సి ఉంటుంది.