పీకే వైపు బాబు చూపు

పీకే వైపు బాబు చూపు
  • కొన్నేళ్లపాటు ఒప్పందం చేసుకునే వ్యూహం
  • ఐపాక్ కు మెగా ఆఫర్ ఇచ్చిన బాబు?
  • 2016లోనే కాంట్రాక్టు కుదుర్చుకునేందుకు ప్రయత్నం

న్యూఢిల్లీ: ఎన్నికలు పూర్తయి నెల రోజులు కూడా కాలేదు. అప్పుడే ఆంధ్ర రాజకీయాల్లో కొత్త ట్విస్ట్!! పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్​కు చెందిన ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ–ఐపాక్ తో టీడీపీ చీఫ్ చంద్రబాబు చర్చలు జరుపుతున్నట్లు ఊహాగానాలు గుప్పుమన్నాయి. ఆంధ్రప్రదేశ్​లో వైఎస్సార్​సీపీ అధికారంలోకి రావడంలో కీలకపాత్ర పోషించిన ఐపాక్​తో ఒప్పందం చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు ఓ నేషనల్ చానెల్​కు చెందిన వెబ్​సైట్​లో వార్తలు వచ్చాయి. కొన్నేళ్లపాటు కాంట్రాక్టు చేసుకుందామని ఐపాక్​కు చంద్రబాబు మెగా ఆఫర్ ఇచ్చారని ఆయన సన్నిహిత వర్గాలు చెప్పినట్లు ఆ చానెల్ తెలిపింది. ప్రశాంత్ కిశోర్, చంద్రబాబు మధ్య రహస్యంగా చర్చలు సాగాయని సోషల్ మీడియా, పలు టీవీ చానెళ్లలో కూడా వార్తలు వచ్చాయి. పీకేను సంప్రదించాలని చంద్రబాబుకు టీడీపీకి చెందిన పలువురు నేతలు సలహా ఇచ్చారన్న కథనాలు వైరల్ అయ్యాయి.

ఒప్పందం కోసం 2016లోనే ప్రయత్నం

ఐపాక్​తో ఒప్పందం కుదుర్చుకునేందుకు చంద్రబాబు 2016లోనే ప్రయత్నించినట్లు కొందరు టీడీపీ నేతలు చెబుతున్నారు. పీకే టీమ్​తో బాబు చర్చించారని, అయితే డీల్ సెట్ కాలేదని అంటున్నారు. ఇప్పుడు కూడా ఈ చర్చలు కొలిక్కివచ్చే అవకాశాలు కష్టమని చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రశాంత్ కిశోర్​పై చంద్రబాబు తీవ్ర విమర్శలు చేయడమే ఇందుకు ప్రధాన కారణమని చెబుతున్నారు. ‘బీహారీ బందిపోటు’ అని పీకేను బాబు తిట్టారు. ఆయన టీమ్​ను బీహార్ గ్యాంగ్ అని విమర్శించారు. ఎన్నికల్లో ఓడిపోతామని అర్థమై చంద్రబాబు ఏదేదో మాట్లాడుతున్నారని పీకే అప్పుడే కౌంటర్ ఇచ్చారు.

2017లో జగన్​ ఒప్పందం

2017లో ప్రశాంత్ కిశోర్​తో జగన్ ఒప్పందం కుదుర్చుకున్నారు. వెంటనే పనిలోకి దిగిన ఐపాక్ టీమ్ పాదయాత్రకు ప్లాన్ చేసింది. ప్రజా సంకల్ప యాత్ర పేరుతో రాష్ర్టమంతటా 3,600 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లారు జగన్. ప్రజలతో నేరుగా మాట్లాడేందుకు, వారి సమస్యలను తెలుసుకునేందుకు యాత్ర ఉపయోగపడింది. వైఎస్సార్​సీపీ తిరుగులేని విజయం సాధించడానికి బాటలు వేసింది. నవరత్నాల పథకం, అభ్యర్థుల ఎంపికలోనూ ఐపాక్ టీమ్ కీలకపాత్ర పోషించింది. ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో వైసీపీతో ఒప్పందం ముగిసిపోయిందా, ఇంకా కొనసాగుతోందా? అనే విషయంలో స్పష్టతలేదు.

పళనిస్వామితో ఐపాక్ డైరెక్టర్ల భేటీ

ఏపీలో వైఎస్సార్​సీపీ విజయం తర్వాత ఐపాక్ క్రేజ్ మరింత పెరిగింది. ఐపాక్​తో కాంట్రాక్టు కుదుర్చుకునేందుకు ప్రయత్నిస్తున్న పార్టీల లిస్టులో ఏఐఏడీఎంకే  కూడా చేరింది. ఐపాక్ డైరెక్టర్లు రిషిరాజ్ సింగ్, వినేశ్ చాందెల్​తో తమిళనాడు సీఎం పళనిస్వామి శుక్రవారం ఢిల్లీలో భేటీ అయ్యారు. 2021లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ మేరకు చర్చలు జరుపుతున్నట్లు ఏఐఏడీఎంకే వర్గాలు కన్ఫార్మ్ చేశాయి.

2012 నుంచి పీకే హవా

2012 గుజరాత్​అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కోసం ప్రశాంత్ కిశోర్ పని చేశారు. ఆయనకు అదే తొలి మేజర్ పొలిటికల్ క్యాంపెయిన్. నరేంద్ర మోడీ వరుసగా మూడోసారి సీఎం అవ్వడంలో కీలకపాత్ర పోషించారు. సిటిజెన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్(సీఏజీ) పేరుతో 2013లో ఓ గ్రూప్ ఏర్పాటు చేసి బీజేపీ కోసం పని చేశారు. 2014 ఎన్నికల్లో కొత్త ఐడియాలు, క్యాంపెయిన్ థీమ్స్ క్రియేట్ చేశారు. ఆ ఎన్నికల్లో బీజేపీ గెలుపుతో దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. 2015లో ఐపాక్ ను ఏర్పాటు చేశారు. బీహార్​లో నితీశ్​కుమార్​తో కలిసి పని చేశారు. జేడీయూ-ఆర్జేడీ కూటమిని గెలిపించారు. తర్వాత జేడీయూ వైస్ ప్రెసిడెంట్ అయ్యారు. 2017లో పంజాబ్​లో కాంగ్రెస్​ను గెలిపించారు. అదే ఏడాది ఉతరప్రదేశ్​లో కాంగ్రెస్ కోసం పని చేసినా, అక్కడ ఆ పార్టీని గెలిపించలేకపోయారు. ప్రశాంత్ కిశోర్​ను చంద్రబాబు సంప్రదించారన్న వార్తలపై రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ క్లారిటీ ఇచ్చారు. అవన్నీ పుకార్లేనని, తాము ఇంతవరకూ ఎవర్నీ సంప్రదించలేదని స్పష్టం చేశారు. కొందరు పనిగట్టుకుని ఇలాంటి వార్తలు ప్రచారం చేస్తున్నారని, టీడీపీ కార్యకర్తలు వీటిని నమ్మొద్దని సూచించారు.

తర్వాత ఎవరితో ఒప్పందం?

వైసీపీతో కాం ట్రాక్టు తర్వాత ఐపాక్ ఇంకే పార్టీతోనూ డీల్ కుదుర్చుకోలేదు. పీకే తన తర్వాతి ఒప్పందం ఎవరితో కుదుర్చుకుంటారోనని దేశవ్యాప్తంగా రాజకీయ వర్గా లు ఆసక్తిగా చూస్తున్నాయి. ఈనెల 8న ప్రశాంత్ కిశోర్..వెస్ట్ బెంగాల్ సీఎం, టీఎంసీ చీఫ్ మమతాబెనర్జీతో భేటీ కావడం చర్చనీయాంశమైంది.వచ్చే ఏడాది బెంగాల్ లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ టీఎంసీతో కలిసి పనిచేస్తారనే ఊహాగానాలు వినిపిం చాయి. కానీస్పష్టత రాలేదు.