కాలుష్యపు కోరల్లో జీడిమెట్ల : బహిరంగ ప్రదేశాల్లోకి రసాయనిక వ్యర్ధాలు

కాలుష్యపు కోరల్లో జీడిమెట్ల : బహిరంగ ప్రదేశాల్లోకి రసాయనిక వ్యర్ధాలు
  • కాలుష్యపు కోరల్లో జీడిమెట్ల
  • నిబంధనలకు విరుద్దంగా కంపెనీలు
  • బహిరంగ ప్రదేశాల్లోకి ఫార్మా, కెమికల్​ పరిశ్రమలు రసాయనిక వ్యర్ధాలు
  • ఘాటైన వాసనలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలు , కార్మికులు

జీడిమెట్ల, వెలుగు:   కొన్నిరోజులుగా వరుసగా కురుస్తున్న వర్షాలను అసరాగా చేసుకుని  పారిశ్రామికవాడల్లోని కొన్ని ఫార్మా, కెమికల్​ పరిశ్రమలు రసాయనిక వ్యర్ధాలను బహిరంగ ప్రదేశాల్లోకి వదిలివేస్తున్నాయి.   జీడిమెట్ల ఇండస్ట్రియల్​ కారిడార్​లో  ఇలాంటి ఘటనలు కార్మికులకు, వాహనదారులకు తీవ్ర ఇబ్బందికరంగా మారుతున్నాయి.  వర్షం కురిసిన ప్రతిసారి వర్షం నీటిమాటున వ్యర్ధ రసాయనాలు వదలడం  అలవాటుగామారుతున్నది. రహదారులు, కాల్వలలో రసాయనిక వ్యర్ధాల ఉనికి బహిరంగంగా కనిపిస్తుండడం గమనార్హం.  పారిశ్రామికవాడలో  ప్రధానంగా నాలాల పక్కన ఉన్న పరిశ్రమలకు  వర్షం  సమయంలో వ్యర్ధాలను వదిలేయడం షరామామూలైందని కార్మికులు ఆరోపిస్తున్నారు.  నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించే పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకున్న దాఖలాలు లేకపోవడంతో వారికి వర్షాలను అనుకూలంగా వాడుకుంటున్నారు.   వ్యర్ధ రసాయనాలు రోడ్లపైకి వదలడంతో  ఘాటైన వాసనలతో ప్రజలు, కార్మికులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.
ఈ సారి జీడిమెట్ల పారిశ్రామికవాడ, ఎస్​వీ కో ఆపరేటివ్​ సొసైటీ పరిధిలో ని రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ వ్యర్ధరసాయనాలు నిల్వలు ఉండడమే ఇందుకు నిదర్శనం.

పట్టించుకోని పీసీబీ అధికారులు

చిన్నపాటి వర్షం కురిసినా  కొన్ని పరిశ్రమల యాజమాన్యాలు వ్యర్ధరసాయనాలను బయటకు వదులతాయేది బహిరంగ రహస్యం. కానీ పొల్యూషన్​ కంట్రోల్ బోర్డు(పీసీబీ) ​ అధికారులు మాత్రం ఈ విషయంలో తెలిసి తెలియనట్లుగా  వ్యహరించడం పలు విమర్శలకు తావిస్తుంది.  గత కొన్ని రోజులుగా వర్షం కురుస్తుండడంతో  కొన్ని పరిశ్రమలు ఇష్టానుసారంగా వ్యర్ధ రసాయనాలు వదులుతున్నారు.
ఇవేవి అధికారులు పట్టించుకోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  వ్యర్ధాల విడుదలతో  పారిశ్రామికవాడలోని రోడ్లపై ఎక్క పడితే అక్కడ వ్యర్ధరసాయనాలు కనిపిస్తున్నాయి.  ఫిర్యాదులు వస్తే తప్ప అధికారులు స్పందించడంలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.    నిబంధనలు పాటించనివారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

చర్యలు తీసుకుంటాం

వర్షం సందర్భంగా పరిశ్రమలు వదిలే రసాయన వ్యర్ధాలపై చర్యలు తీసు కుంటాం.  ఇటీవల వర్షాల సందర్భంగా అలాంటి ఉదంతాలు మా దృష్టికి రాలేదు. సిబ్బందిని జీడిమెట్ల ఇండస్ట్రియల్​ ఏరియాకు పంపిస్తాను. అక్కడి శాంపిల్స్​ను సేకరించి నిర్ధారిం చుకుని కఠిన చర్యలు తీసుకుంటాం.
– కుమార్​ పాఠక్​, ఎన్విరాన్​మెంటల్​ ఇంజినీర్​, పీసీబీ, మేడ్చల్​ జిల్లా