వికటించిన ట్యాబ్లెట్లు.. చిన్నారి మృతి.. 30 మందికి అస్వస్థత

వికటించిన ట్యాబ్లెట్లు.. చిన్నారి మృతి.. 30 మందికి అస్వస్థత
  • మరో 30 మందికి అస్వస్థత
  • జగిత్యాల జిల్లాలో ఘటన

జగిత్యాల, వెలుగు: అల్బెండజోల్ ట్యాబ్లెట్లు వికటించి ఓ చిన్నారి మృతి చెందగా, మరో 30 మంది స్టూడెంట్లు అస్వస్థతకు గురైన సంఘటన జగిత్యాల జిల్లాలోని ధర్మపురి పట్టణంలో జరిగింది. జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా సోమవారం జిల్లాలో అల్బెండజోల్ ట్యాబ్లెట్ల పంపిణీ ప్రారంభించారు. ధర్మపురి పట్టణానికి చెందిన తిప్పర్తి మారుతి-, రజిత దంపతులకు హర్షవర్ధన్(12)​, సహస్ర (8), రుద్ర (6) ముగ్గురు సంతానం. సహస్ర పట్టణంలోని ఓ ప్రైవేట్ స్కూల్ లో రెండో తరగతి చదువుతోంది. మధ్యాహ్నం లంచ్ కు ఇంటికి వచ్చిన చిన్నారి తిరిగి స్కూల్ కు వెళ్తుండగా అంగన్ వాడీ కేంద్రంలో ఆశావర్కర్ బాలిక ను పిలిచి అల్బెండజోల్ ట్యాబ్లెట్ వేసిందని కుటుంబసభ్యులు చెబుతున్నారు. తర్వాత స్కూల్ కు చేరుకున్న చిన్నారి వాంతులు చేసుకోవడంతో పాటు అపస్మారక స్థితిలోకి వెళ్లింది. స్కూల్ యాజమాన్యం పేరెంట్స్ కు సమాచారమివ్వడంతో లోకల్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించిందని డాక్టర్లు చెప్పడంతో జగిత్యాల ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు అక్కడి డాక్టర్లు చెప్పారు. కూతురు చనిపోయిందని చెప్పడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నామని ధర్మపురి ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. మరోవైపు అస్వస్థతకు గురైన చిన్నారులకు ధర్మపురి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆరోగ్య శాఖ సిబ్బంది నిర్లక్ష్యంతోనే ఇలా జరిగిందని స్టూడెంట్స్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

ట్యాబ్లెట్ల పంపిణీ నిలిపివేత…

జిల్లాలో పంపిణీ కోసం 2.50 లక్షల అల్బెండజోల్ ట్యాబ్లెట్లను ఇప్పటికే ఆయా హెల్త్ సెంటర్లకు పంపించారు. అయితే ఈ ఘటన జరిగిన నేపథ్యంలో ట్యాబ్లెట్లను ఎవరికీ వేయొద్దని డీఎంహెచ్ఓ శ్రీధర్​అధికారులను ఆదేశించారు. మృతదేహం నుంచి సేకరించిన శాంపిళ్లను వరంగల్ మెడికల్​ల్యాబ్ కు టెస్టుల కోసం పంపినట్లు తెలిపారు.  టెస్టులు, పోస్టుమార్టం రిపోర్టులు వచ్చాక మృతికి గల కారణాలు తెలుస్తాయన్నారు. ఈ ఘటనపై వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆరా తీసినట్లు తెలిసింది. డేట్ అయిపోయిన ట్యాబ్లెట్లు పంపిణీ చేయడంతోనే ఇలా జరిగి ఉండొచ్చని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై న్యాయ విచారణ చేయాలని డిమాండ్ చేశారు.

మరిన్ని వెలుగు వార్తల కోసం…