చిన్నారి మీద నుంచి వెళ్లిన చెత్త బండి

చిన్నారి మీద నుంచి వెళ్లిన చెత్త బండి

మల్కాజ్ గిరిలో దారుణం జరిగింది. మౌలాలి డివిజన్ ఆర్టీసీ కాలనీలో చెత్త సేకరించే ఆటో కింద పడి 16 నెలల చిన్నారి మృతి చెందింది. చెత్త సేకరించే ఆటో ఆగి ఉండగా వెనక నుంచి వచ్చిన చిన్నారి ఆటో కింద పడింది. ఆటో ఒక్కసారిగా వెనకాల ఉన్న  చిన్నారి మీదకు ఎక్కింది.  ఆటో డ్రైవర్ ఈ విషయం గమనించే లోపే చిన్నారి ప్రాణలు కోల్పోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు  పోస్టు మార్టం కొరకు చిన్నారి మృతదేహాన్ని గాంధీకి తరలించారు. చిన్నారి మృతితో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.

16 నెలల చిన్నారిపై నుంచి చెత్త బండి చక్రాల కింద పడి నలిగిపోవటం స్థానికులను ఆవేదనకు గురి చేసింది. వాహనాలు వెళ్లే సమయంలో ముందూ వెనకా చూసుకోవాలని.. ముఖ్యంగా కాలనీల్లో తిరిగే సమయంలో పిల్లలు రోడ్లపై ఆడుకుంటూ ఉంటారని.. వాహనాలదారులు జాగ్రత్తగా చూసుకోవాలని కోరుతున్నారు. మొన్నటికి మొన్న కారు రివర్స్ చేస్తూ.. ఆ కారు కింద పడి ఓ చిన్నారి చనిపోయిన ఘటన మరువక ముందే.. మౌలాలిలో చెత్త బండి కింద పడి ఓ చిన్నారి చనిపోవటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు స్థానికులు.