RR vs DC: ఐపీఎల్ కోడ్ ఉల్లంఘన.. సంజు శాంసన్‌కు జరిమానా విధించిన బీసీసీఐ

RR vs DC: ఐపీఎల్ కోడ్ ఉల్లంఘన.. సంజు శాంసన్‌కు జరిమానా విధించిన బీసీసీఐ

రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ పై బీసీసీఐ కొరడా ఝళిపించింది. అతనికి జరిమానా విధిస్తూ శిక్షించింది. మంగళవారం (మే 7) ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఔటైన తర్వాత అంపైర్ పై అసంతృప్తి వ్యక్తం చేశాడు. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన శాంసన్ కు మ్యాచ్ ఫీజ్ లో 30 శాతం జరిమానా విధించారు. ఈ సీజన్ లో శాంసన్ ఇప్పటికే స్లో ఓవరేట్ కారణంగా బీసీసీఐ 12 లక్షలు జరిమానా ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.   

అసలేం జరిగిందంటే..?

ఐపీఎల్ లో భాగంగా మంగళవారం (మే 8) రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ ఔట్ ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది. ఢిల్లీ ఫాస్ట్ బౌలర్ ముఖేష్ కుమార్ వేసిన ఇన్నింగ్స్ 16 వ ఓవర్ నాలుగో బంతికి శాంసన్ లాంగాన్ మీదుగా  షాట్ ఆడాడు. టైమింగ్ సరిగా కుదరకపోవడంతో ఫీల్డర్ హోప్ పట్టిన అద్భుతమైన క్యాచ్ కు శాంసన్ ఔటయ్యాడు. 

థర్డ్ అంపైర్ చెక్ చేసినప్పుడు ఒక యాంగిల్ లో హోప్ బౌండరీకి తగులుతున్నట్లుగా కనిపిస్తుంది. అయితే మరో యాంగిల్ లో మాత్రం బౌండరీ రోప్ ను టచ్ చేయనట్లుగా చూపించింది. ఈ దశలో థర్డ్ అంపైర్ శాంసన్ ను ఔట్ గా ప్రకటించాడు. రీప్లేలో ఒక్కసారి మాత్రమే చూపించి ఔట్ అని నిర్ధారించడంతో అందరూ షాక్ అయ్యారు. ఈ నిర్ణయం పట్ల అసహనం వ్యక్తం చేసిన శాంసన్..అంపైర్లతో వాదించాడు. అంపైర్ నచ్చజెప్పడంతో శాంసన్ పెవిలియన్ బాట పట్టాడు. 

ఈ మ్యాచ్ విషయానికి వస్తే ఢిల్లీ థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. కెప్టెన్ సంజు శాంసన్(46 బంతుల్లో 86, 8 ఫోర్లు, 6 సిక్సులు) అసాధారణంగా పోరాడినా ఢిల్లీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో రాజస్థాన్ కు పరాజయం తప్పలేదు. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో రాజస్థాన్ 201 పరుగులు మాత్రమే చేయగలిగింది.