చిన్నారి కిడ్నాప్.. సీసీ ఫుటేజీ ఆధారంగా గంటల్లో పట్టుకున్న పోలీసులు

చిన్నారి కిడ్నాప్.. సీసీ ఫుటేజీ ఆధారంగా గంటల్లో పట్టుకున్న పోలీసులు
  • పాపను హత్తుకుని పోలీసులకు కన్నీటితో కృతజ్ఘతలు తెలిపిన తల్లి

హైదరాబాద్: 18నెలల చిన్నారిని ఓ మహిళ కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్లగా.. తల్లి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన నాంపల్లి పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా గంటల్లో కిడ్నాపర్ ను గుర్తించారు. ఆ చిన్నారిని రక్షించి తల్లి వద్దకు చేర్చారు. తన పాప కిడ్నాప్ కు గురికావడంతో కన్నీరు మున్నీరుగా విలపించిన తల్లి.. చెంతకు బిడ్డ చేరగానే ఆమె ఆనంద భాష్పాలతో పోలీసులకు కృతజ్ఘతలు తెలిపింది. తన పాపను క్షేమంగా కాపాడిన పోలీసుల రుణం తీర్చుకోలేనంటూ కన్నీటి పర్యంతం అయింది. ఈ ఘటన హైదరాబాద్ లో జరిగింది.

రంగారెడ్డి జిల్లా బొబ్బిలిగం గ్రామానికి చెందిన మాధవి గర్భిణి. రెగ్యులర్ చెకప్ కోసం తన 18 నెలల కూతురుతో కలిసి ఈరోజు ఉదయం నాంపల్లి నిలోఫర్ హాస్పిటల్ కు వచ్చింది. ఆస్పత్రిలో చెకప్ చేయించుకున్న అనంతరం రిపోర్ట్స్ తీసుకోడానికి వెళ్లింది. వెంటనే తిరిగి వచ్చేసరికి తన కూతురు కనిపించలేదు. దీంతో తల్లడిల్లిన మాధవి వెంటనే నాంపల్లి పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న నాంపల్లి పోలీసులు రంగంలోకి దిగారు. ఆస్పత్రికి వచ్చి పరిసరాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ లను పరిశీలించగా కిడ్నాప్ చేసింది ఓ మహిళగా గుర్తించారు. పాపను కిడ్నాప్ చేసిన మహిళ హాస్పిటల్ ముందు ఆటో ఎక్కి వెళ్లినట్లు గుర్తించారు. ఆటో నెంబర్ ఆధారంగా ఆటో డ్రైవర్ ను మసాబ్ ట్యాంక్ వద్ద అదుపులోకి తీసుకున్నట్లు సైఫాబాద్ ఏసీపీ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. ఆటో డ్రైవర్ ను విచారించారు. పాపను కిడ్నాప్ చేసిన శ్రీదేవి అనే మహిళను హాబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోమటికుంట కల్లు కాంపౌండ్ వద్ద అదుపులోకి తీసుకొని పాపను తల్లి వద్దకు చేర్చామని వివరించారు. తన కూతురును సురక్షితంగా తన వద్దకు చేరడంతో పాప తల్లి పోలీసులకు కన్నీటితో కృతజ్ఞతలు తెలిపింది. కిడ్నాపర్ శ్రీదేవి వద్ద నుండి పాపకు చెందిన వెండి ఆభరణాలు , కల్లు ప్యాకెట్లతోపాటు కొంత నగదును స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.