రోడ్డు పక్కన టిఫిన్ తింటుండగా ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ముగ్గురు మృతి

రోడ్డు పక్కన టిఫిన్ తింటుండగా ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు..  ముగ్గురు మృతి
  • టిఫిన్​ చేస్తున్న ముగ్గురు మృతి
  • మృతులందరిదీ ఒకే కుటుంబం
  • ఓటేసేందుకు వెళ్తుండగా జనగామ జిల్లాలోని రఘునాథపల్లి వద్ద ప్రమాదం
  • వరంగల్​లోని ఉర్సులో విషాదం

రఘునాథపల్లి, వెలుగు: ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. రోడ్డు పక్కన ఉన్న మొబైల్​ టిఫిన్​ సెంటర్​లోకి బస్సు దూసుకు రావడంతో ప్రమాదం జరిగింది. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని పెట్రోల్ బంకు సమీపంలో సోమవారం జరిగిన ఈ ఘటనలో టిఫిన్​ సెంటర్​ నిర్వాహకులకూ గాయాలయ్యాయి. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ నగరం ఉర్సుకు చెందిన  తెలకలపల్లి రవీందర్ (35) బీబీనగర్ లో  వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం ఉదయం వరంగల్ లో ఓటు వేయడానికి తమ సొంత వాహనంలో భార్య తెలకలపల్లి జ్యోతి(32), కొడుకు తెలకలపల్లి భవిశ్​(8)తో కలిసి వెళ్తుండగా, రఘునాథపల్లి గ్రామ సమీపంలోని  పెట్రోల్ బంకు వద్ద రోడ్డు పక్కనే  ఉన్న మొబైల్ క్యాంటీన్​లో టిఫిన్ చేయడానికి  ఆగారు. అదే సమయంలో  హైదరాబాద్ నుంచి వరంగల్ వైపు వెళ్తున్న రాజధాని బస్సు  టిఫిన్​ సెంటర్​లోకి అతివేగంగా దూసుకొచ్చింది.

ఈ ప్రమాదంలో జ్యోతి  స్పాట్ లోనే మృతి చెందగా రవీందర్, భవిశ్​తోపాటు టిఫిన్​ సెంటర్  నిర్వాహకులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని, గాయపడినవారిని 108 వాహనంలో జనగామ జిల్లా హాస్పిటల్​కు తరలిస్తున్న క్రమంలో భవిశ్​ మృతి చెందాడు. రవీందర్ దవాఖానలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు.  

టిఫిన్​ సెంటర్​ నిర్వాహకులను ప్రాథమిక చికిత్స అనంతరం వరంగల్ ఎంజీఎం హాస్పిటల్​కు తరలించారు. జ్యోతి తండ్రి  ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్​ఐ నరేశ్​ తెలిపారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో వరంగల్ జిల్లా ఉర్సులో  విషాద ఛాయలు నెలకొన్నాయి.