యూపీలో దారుణం: మరణించిన తండ్రి.. అస్థి పంజరంలా కూతురు.. ఆ ఇంట్లో జరిగింది ఇదీ..

యూపీలో దారుణం: మరణించిన తండ్రి.. అస్థి పంజరంలా కూతురు.. ఆ ఇంట్లో జరిగింది ఇదీ..

ఉత్తరప్రదేశ్ లో మహోబా జిల్లాలో దారుణం జరిగింది... కేర్ టేకర్స్ కర్కశత్వం కారణంగా ఓ రైల్వే ఉద్యోగి మరణించగా.. మానసిక వికలాంగురాలైన అతని కుమార్తె అస్థి పంజరంలా మారింది. కేర్ టేకర్స్ ఐదేళ్ల పాటు ఇంట్లోనే బంధించి చిత్రహింసకు గురి చేయడంతో తండ్రి కూతురికి ఈ గతి పట్టింది. వింటుంటేనే మనసును కలిచివేస్తున్న ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. 70 ఏళ్ళ రిటైర్డ్ సీనియర్ రైల్వేక్లర్క్ ఓం ప్రకాష్ సింగ్ రాథోడ్, మానసిక వికలాంగురాలైన అతని కుమార్తె రష్మీ ఆ ఇంట్లో ఉంటున్నారు. ఓం ప్రకాష్ భార్య 2016లో మరణించడంతో అప్పటి నుంచి కుష్వాహా, అతని భార్య రాందేవిలను కేర్ టేకర్స్ గా నియమించుకున్నారు.వృద్ధుడైన తండ్రిని, మానసిక వికలాంగురాలైన అతని కుమార్తెను సంరక్షించాల్సిన ఆ కేర్ టేకర్స్ వారి పాలిట మృత్యు దేవతలుగా మారారు.

ఓం ప్రకాష్, రష్మిల కేర్ టేకర్స్ గా వచ్చిన కుష్వాహా దమతులు ఇంటిని తమ ఆధీనంలోకి తీసుకొని.. బాధితులను గ్రౌండ్ ఫ్లోర్ కి పరిమితం చేసి, సెకండ్ ఫ్లోర్ ని ఆక్రమించారు. బాధితులకు కనీసం తిండి కూడా పెట్టకుండా ఇంట్లోనే బంధించి చిత్రహింసకు గురి చేశారు నిందితులు. ఎవరైనా ఓం ప్రకాష్ ను చూడటానికి వస్తే.. ఏదో ఒక సాకు చెప్పి, ఓం ప్రకాష్ ఎవరినీ కలవడానికి ఇష్టపడటం లేదంటూ పంపించేవారని బంధువులు ఆరోపిస్తున్నారు.

సోమవారం ( డిసెంబర్ 29 ) ఓం ప్రకాష్ మరణవార్త తెలియడంతో ఇంటికి చేరుకున్న బంధువులు భయంకరమైన సీన్ ని చూశామని అంటున్నారు. పూర్తిగా కృశించిపోయిన ఓం ప్రకాష్ మృతదేహం, అతని కుమార్తె నగ్నంగా చీకటి గదిలో ఉండటం చూసి  షాక్ అయ్యారు బంధువులు. ఆకలితో అలమటిస్తున్న రష్మి శరీరం 80 ఏళ్ళ వృద్ధురాలిలా ఉందని అంటున్నారు బంధువులు. రష్మి శరీరంపై మాంసం ముక్క లేదని.. ఒక అస్థి పంజరంలా తయారయ్యిందని తెలిపారు బంధువులు.

ఆసుపత్రికి చేరుకునే లోపే ఓంప్రకాష్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్ట్ మార్టం కోసం పంపారు.ఒకప్పుడు గౌరవప్రదమైన జీవితాన్ని గడిపి... ఎప్పుడూ సూట్, టైలోనే కనిపించిన ఓంప్రకాష్ ఫ్యామిలీకి గతి పట్టడం చూసి ఇరుగుపొరుగు వారు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. మానసిక వికలాంగురాలైన రష్మిని జాగ్రత్తగా చూసుకుంటామని..  దోషులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు బంధువులు.