హైదరాబాద్: హైదరాబాద్ సిటీలో విషాద ఘటన జరిగింది. రాజేంద్రనగర్ బండ్లగూడలో లిఫ్ట్ కారణంగా ఒక నిండు ప్రాణం గాల్లో కలిసింది. లక్ష్మీ అనే వృద్ధురాలు నాలుగో అంతస్తు నుంచి కింద పడిపోయి చనిపోయింది.
నాలుగో అంతస్తు నుంచి కిందకు వచ్చేందుకు బయటికొచ్చిన ఆమె.. లిఫ్ట్ వచ్చిందనుకొని గ్రిల్ ఓపెన్ చేయడంతో దురదృష్టవశాత్తూ ఆమె కింద పడిపోయింది. నాల్గవ అంతస్తు సుంచి లిఫ్ట్ గుంతలో పడిపోవడంతో తీవ్ర గాయాల పాలైన ఆమె స్పాట్లోనే చనిపోయింది.
కూతురుని చూసేందుకు హైదరాబాద్ సిటీకి వచ్చిన లక్ష్మి అనే ఈ వృద్ధురాలు ఇలా ప్రమాదవశాత్తూ లిఫ్ట్ గుంతలో పడి చనిపోయిందని తెలిసి.. అపార్ట్మెంట్ వాసులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తనను చూడటానికి వచ్చిన తల్లి ఇలా అర్థాంతరంగా తనువు చాలించడంతో ఆమె కన్న కూతురు కన్నీరుమున్నీరయింది. గుండెలవిసేలా రోదించింది. లిఫ్ట్ ఇండస్ట్రీపై ఎలాంటి పర్యవేక్షణ లేకపోవడంతో సమస్యలు పెరిగిపోతున్నాయి. ప్రత్యేక మానిటరింగ్ వ్యవస్థ లేకపోవడంతో చాలా మంది లిఫ్ట్ ఇండస్ట్రీ ఆపరేటర్లు.. స్పీడ్ గవర్నర్లు, ఎమర్జెన్సీ బ్రేకులు వంటి సరైన ప్రమాణాలు పాటించకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.
లిఫ్టులపై కొత్త పాలసీ ఇప్పటికీ అమల్లోకి రాలేదు. ఈ పాలసీ అమల్లోకి వస్తే కొంతమేరకు ప్రమాదాలను అరికట్టవచ్చని ప్రభుత్వం భావిస్తున్నది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, జీహెచ్ ఎంసీలోని టౌన్ ప్లానింగ్ విభాగాల నుంచి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అనుమతులు పొందడంతో పాటు ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు పొందాలి. అలాగే, లిఫ్టులు, బడా ఎలివేటర్లు ఏర్పాటు చేసుకోవడానికి భవన యజమానులు ఎలక్ట్రికల్ ఇన్ స్పెక్టర్ విభాగం నుంచి క్లియరెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో.. విద్యుత్ తనిఖీ విభాగం లిఫ్ట్ పాలసీ రూపకల్పనలో కీలక పాత్ర పోషిస్తుంది.
హైదరాబాద్ కేంద్రంగా రాష్ట్రంలో దాదాపు 3 వేల కోట్లకు పైగా లిఫ్ట్ ఇండస్ట్రీ స్పేర్ పార్ట్స్వ్యాపారం జరుగుతోంది. ప్రతి ఏటా దాదాపు 50 వేల లిఫ్టుల ఉత్పత్తి జరుగుతున్నది. ఈ వ్యవస్థను పకడ్బందీగా
అమలు చేస్తే.. రాష్ట్రంలో లిఫ్ట్ ప్రమాదాల నుంచి గట్టెక్కించవచ్చని తాజాగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం లిఫ్ట్ పాలసీ అమలవుతున్న రాష్ట్రాల్లో భవనాల యజమానులు లైసెన్సులు పొంది లిఫ్టు చట్టం కింద నిర్ణీత రుసుము చెల్లిస్తున్నారు.
