ఇంటర్ ‘మ్యాథ్స్’ లో కొత్త లెక్కలు.. సిలబస్, పరీక్షల విధానంలో మార్పులు

ఇంటర్  ‘మ్యాథ్స్’ లో కొత్త లెక్కలు.. సిలబస్, పరీక్షల విధానంలో మార్పులు
  •     వచ్చే ఏడాది నుంచి 60 మార్కులకే పరీక్ష 
  •     మరో 15 మార్కులు ఇంటర్నల్స్ కు 
  •     ఎంపీసీ, ఎంఈసీ స్టూడెంట్లకు వేర్వేరుగా క్వశ్చన్  పేపర్లు 

హైదరాబాద్, వెలుగు: ఇంటర్మీడియెట్  మ్యాథమెటిక్స్  పరీక్షల విధానం, సిలబస్ లో ఇంటర్  బోర్డు భారీ మార్పులు చేస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ‘కొత్త లెక్క’లను అమలు చేయబోతోంది. ఇప్పటి వరకు మ్యాథ్స్ పేపర్  అంటే 75 మార్కులకు రాత పరీక్ష ఉంది. వచ్చే ఏడాది నుంచి ఇది మారనుంది. సీబీఎస్ఈ తరహాలో ఇంటర్నల్  మార్కుల విధానాన్ని తీసుకురావాలని బోర్డు నిర్ణయించింది. 

ప్రస్తుతం ఇంటర్​లో మ్యాథ్స్–ఏ, మ్యాథ్స్–బీ పేపర్లు 75 మార్కుల చొప్పున జరుగుతున్నాయి. వచ్చే అకాడమిక్  ఇయర్  నుంచి థియరీ పరీక్షను 60 మార్కులకు కుదించనున్నారు. మిగిలిన 15 మార్కులను ‘ఇంటర్నల్స్’ కు కేటాయించనున్నారు. అంటే కాలేజీల చేతిలో ఈ 15 మార్కులు ఉండనున్నాయి. విద్యార్థి సామర్థ్యం, ప్రాజెక్టులు, అటెండెన్స్  వంటి అంశాల ఆధారంగా ఇంటర్నల్స్​లో మార్కులు వేస్తారు. 

దీంతో విద్యార్థులపై పరీక్షల ఒత్తిడి కొంత తగ్గే అవకాశం ఉంది. ఇప్పటివరకూ ఎంపీసీ,  ఎంఈసీ విద్యార్థులకు మ్యాథ్స్  పేపర్  ఒకేలా ఉంది. రెండు పేపర్లకు వచ్చే 150 మార్కులను శాతంగా తీసుకొని వంద మార్కులకు కుదించారు. ఇకపై ఈ విధానానికి చెక్  పడనున్నది. ఎంఈసీ విద్యార్థులకు మ్యాథ్స్  పేపర్ ను వంద మార్కులకు నిర్వహించనున్నారు. ఎంపీసీ, ఎంఈసీ విద్యార్థులకు వేర్వేరుగా ప్రశ్నపత్రాలు రూపొందించనున్నారు. 

ఎంఈసీకి వేరుగా సిలబస్..

కామర్స్  బ్యాక్ గ్రౌండ్  ఉండే ఎంఈసీ వాళ్లకు వారి సబ్జెక్టులకు ఉపయోగపడేలా మ్యాథ్స్  సిలబస్ ను రూపొందించనున్నారు. అలాగే, పరీక్షల విధానంతో పాటు సిలబస్ లోనూ మార్పులు జరగనున్నాయి. ప్రస్తుతం మ్యాథ్స్ బీలోనే ఎక్కువ మంది ఫెయిల్  అవుతున్నారు. దీన్ని గమనించిన ఇంటర్  బోర్డు.. మ్యాథ్స్ బీ పాఠ్య పుస్తకంలోని కొన్ని కఠినమైన చాప్టర్లను మ్యాథ్స్ ఏలోకి మార్చాలని డిసైడ్  అయింది. ఈ మార్పులన్నీ వచ్చే విద్యా సంవత్సరం (2026–27 ) నుంచే పక్కాగా అమలు కానున్నాయి.