AI Layoffs: వైట్ కాలర్ ఉద్యోగులకు బ్యాడ్ టైం.. 2026 నుంచి భారీ లేఆఫ్స్, ఏఐ గాడ్‌ఫాదర్ హెచ్చరిక

AI Layoffs: వైట్ కాలర్ ఉద్యోగులకు బ్యాడ్ టైం.. 2026 నుంచి భారీ లేఆఫ్స్,  ఏఐ గాడ్‌ఫాదర్ హెచ్చరిక

టెక్నాలజీ ప్రపంచంలో ఇప్పుడు ఒకటే చర్చ.. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సాఫ్ట్‌వేర్ రంగం నుంచి సామాన్య పనుల వరకు అన్నింటినీ తన గుప్పిట్లోకి తెచ్చుకుంటున్న ఏఐ.. రాబోయే రోజుల్లో పెను మార్పులకు కారణం కాబోతోంది. తాజాగా 'గాడ్‌ఫాదర్ ఆఫ్ ఏఐ'గా పిలవబడే జెఫ్రీ హింటన్ చేసిన హెచ్చరికలు.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. 2026 నాటికే ఒక భయంకరమైన 'జాబ్‌లెస్ బూమ్' రాబోతుందని ఆయన చెప్పిన మాటలు నిద్రలేకుండా చేస్తున్నాయి. అంటే కంపెనీల ఉత్పాదకత పెరుగుతుంది కానీ అందులో మనుషుల అవసరం మాత్రం తగ్గిపోనుందని దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి.

గతంలో ఏఐ కేవలం చిన్న చిన్న పనులకే పరిమితమై ఉండేదని హింటన్ అన్నారు. కానీ ఇప్పుడు అది ప్రతి ఏడు నెలలకు ఒకసారి తన సామర్థ్యాన్ని రెట్టింపు చేసుకుంటోందని చెప్పారు. నెలల తరబడి సాగే సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ ప్రాజెక్టులను కేవలం కొన్ని గంటల్లోనే పూర్తి చేసే స్థాయికి ఇది చేరుకుందన్నారు. దీనివల్ల కంపెనీలు భారీగా మానవ వనరులను తగ్గించుకుని, ఆటోమేషన్ వైపు మొగ్గు చూపుతున్నాయి. ముఖ్యంగా వైట్ కాలర్ ఉద్యోగాలపై ఈ ప్రభావం తీవ్రంగా ఉండబోతోంది. ఇప్పటికే అనేక దిగ్గజ సంస్థలు తమ ఖర్చులను తగ్గించుకోవడానికి లేఆఫ్స్ ప్రకటించటం రోజూ వార్తల్లో సాధారణంగా మారిపోయింది.

ALSO READ : సిరియా కొత్త కరెన్సీ

అయితే ఏఐ నాణేనికి మరో పక్క కూడా ఉంది. టెనియో వంటి కొన్ని సంస్థల సర్వే ప్రకారం.. AI వల్ల కొత్త రకమైన ఉద్యోగాలు వస్తాయని, ముఖ్యంగా ఎంట్రీ లెవల్ ఇంజనీర్లకు మరిన్ని అవకాశాలు లభిస్తాయని కొందరు సీఈఓలు భావిస్తున్నారు. కానీ.. హింటన్ హెచ్చరికలను బట్టి చూస్తే, ఈ కొత్త ఉద్యోగాల సంఖ్య పోయే ఉద్యోగాల కంటే చాలా తక్కువగా ఉండే ప్రమాదం ఉందని స్పష్టంగా తెలుస్తోంది. కంపెనీలు కేవలం AI ని ఆపరేట్ చేయగల నైపుణ్యం ఉన్న వారిని మాత్రమే ఉంచుకుని, మిగిలిన వారిని ఇళ్లకు పంపే ప్రమాదం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. 

రానున్న 2026 సంవత్సరం టెక్ రంగానికి ఒక అగ్నిపరీక్ష లాంటిదని చెప్పుకోవచ్చు. ఉద్యోగులు తమను తాము నిరంతరం అప్‌డేట్ చేసుకోకపోతే.. ఈ AI ప్రవాహంలో కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. సాంకేతికత అభివృద్ధి చెందడం మంచిదే అయినా.. అది సామాన్య మానవుడి జీవనోపాధిని దెబ్బతీసే విధంగా ఉండకూడదన్నది నిపుణుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి, 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' అనేది ఒకవైపు అద్భుతమైన ఆవిష్కరణగా కనిపిస్తున్నా, మరోవైపు ఉద్యోగ భద్రతకు ఒక పెద్ద ప్రమాదంగా మారుతోంది. రానున్న 10 ఏళ్లు ఇదే కొనసాగితే  ఉద్యోగులతో అవసరం దాదాపు కనుమరుగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.