హైదరాబాద్: ప్రముఖ యూట్యూబర్ అన్వేష్పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. హిందూ దేవీ దేవతలను దూషించినందుకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో అతనిపై సినీనటి, బీజేపీ నాయకురాలు కరాటే కళ్యాణి ఫిర్యాదు చేసింది. కళ్యాణి ఫిర్యాదుతో అన్వేష్పై 352,79,299 BNS SEC 67IT ACT కింద పోలీసులు కేసు నమోదు చేశారు. పంజాగుట్ట పోలీసులు త్వరలో అన్వేష్కి నోటీసులు జారీ చేయనున్నారు. అన్వేష్ వివాదాస్పద కామెంట్స్పై తెలంగాణలో వరుస ఫిర్యాదులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. అతనిని భారత దేశానికి రప్పించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
అన్వేష్ను దేశ ద్రోహిగా ప్రకటించాలని డిమాండ్ చేశాయి. స్త్రీల వస్త్రధారణ విషయంలో టాలీవుడ్లో ఇటీవల నెలకొన్న వివాదంపై స్పందిస్తూ.. హిందువులు దేవతగా కొలిచే సీతా దేవి గురించి యూట్యూబర్ అన్వేష్ జుగుప్సాకరంగా మాట్లాడాడు. ద్రౌపది దేవి గురించి కూడా అసభ్యకర రీతిలో వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలపై హిందూ సంఘాలు భగ్గుమన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో అన్వేష్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుతున్నాడని.. అతనిని ఇండియాకు తీసుకొచ్చి కఠినంగా శిక్షించాలని హిందూ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
