నకిలీ సిమ్ కార్డులతో ఆన్ లైన్ బెట్టింగ్..హైదరాబాద్ లో యువకుడి నుంచి రూ. కోటి వసూలు

నకిలీ సిమ్ కార్డులతో  ఆన్ లైన్ బెట్టింగ్..హైదరాబాద్ లో  యువకుడి నుంచి రూ. కోటి  వసూలు

హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ఆన్‌లైన్ బెట్టింగ్ మోసాలకు సహకరించిన నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.  నిందితులు కుటుంబ సభ్యులు, స్నేహితుల పేర్లతో తీసుకున్న సిమ్ కార్డులను మోసపూరిత కార్యకలాపాలకు సరఫరా చేసినట్లు గుర్తించారు. 

హైదరాబాద్‌కు చెందిన 36 ఏళ్ల వ్యక్తిని BETINEXCHANGE పేరుతో బెట్టింగ్ ద్వారా భారీ లాభాలు వస్తాయని నమ్మించారు. మొదట రూ.20 వేలు డిపాజిట్ చేయించి రూ. 5,000 లాభం చూపించి నమ్మకం కల్పించారు.  తరువాత బాధితుడి నుంచి 2025 నుండి జనవరి 2026 మధ్య సుమారు రూ.1.5 కోట్లు వసూలు చేశారు. డబ్బు తీసుకున్న తర్వాత BETINEXCH.COM, FUNINEXCHANGE వంటి వెబ్‌సైట్ డొమైన్‌లు మారుస్తూ మోసం చేశారు.  

ప్రధాన నిందితుడు ఫరీద్ (A1) దుబాయ్‌లో పనిచేసిన అనుభవంతో సిమ్ కార్డులు సేకరించి విక్రయించాడు. A2, A3, A4 తమ కుటుంబ సభ్యుల పేర్లతో సిమ్ కార్డులు తీసుకుని A1కి ఇచ్చారు.  సుమారు 250 సిమ్ కార్డులు దుబాయ్‌లో ఉన్న వ్యక్తికి విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు.  నిందితుల దగ్గరి నుంచి 5 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు  నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. ప్రజలు ఆన్‌లైన్ బెట్టింగ్ ప్రకటనలు, తెలియని లింకులు నమ్మవద్దని హెచ్చరించారు.