Smriti Mandhana: ఐసీసీ నెంబర్–1 బ్యాటర్గానే స్మృతి మంధాన.. 

Smriti Mandhana: ఐసీసీ నెంబర్–1 బ్యాటర్గానే స్మృతి మంధాన.. 

Smriti Mandhana: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా ఉమెన్స్ వన్డే ర్యాంకింగ్స్ జాబితాను రిలీజ్ చేసింది. భారత స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన తన నెంబర్ వన్ స్థానాన్ని మరోసారి నిలబెట్టుకుంది. ఇటీవలే టీమిండియా మహిళల జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించింది. టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న ఇండియన్ టీమ్.. వన్డే, టెస్ట్ సిరీస్‌ను మాత్రం కోల్పోయింది. దీంతో తాజా ర్యాంకింగ్స్ లో పలు కీలక మార్పులు నెలకొన్నాయి. స్మృతి మంధాన 790 పాయింట్లతో అగ్రస్థానంలోనే ఉండగా.. ఆ తర్వాతి స్థానాల్లో సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్ట్(782), బెత్ మూనీ(749) కొనసాగుతున్నారు. టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 652 పాయింట్లతో 8వ ప్లేస్ లోనే నిలిచింది. కాగా మరో స్టార్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ ఒక స్థానం దిగజారి 12వ ( 635 పాయింట్ల) స్థానానికి పరిమితమైంది. ఇక బౌలింగ్ లో ఆసీస్ ప్లేయర్ అలానా కింగ్ 775 పాయింట్లతో తొలి స్థానంలో కొనసాగుతుంది. 

ఐసీసీ తాజా ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్ మహిళా క్రికెటర్లు రికార్డు సృష్టించారు. ఆ జట్టు ప్రస్తుతం జింబాబ్వేతో 3 వన్డేల సిరీస్ ఆడుతోంది. ఇప్పటికే 2-–0తో ఆధిక్యంలో దూసుకుపోతుంది. టీమ్ కొత్త కెప్టెన్ అమేలీయా కెర్ బాల్ అండ్ బ్యాట్ తోనూ మెరిసింది. తొలి మ్యాచ్‌లో 4 వికెట్లు పడగొట్టిన ఆమె.. సెకండ్ వన్డేలో 7 వికెట్లు తీసి చరిత్ర సృష్టించింది. ఉమెన్స్ వన్డేల్లో 7 వికెట్లకు పైగా తీసిన 7వ ప్లేయర్‌గా కెర్ అవతరించింది. ఈ ప్రదర్శనతో బౌలర్ల జాబితాలో ఆమె ఐదు స్థానాలు ఎగబాకి 11వ ( 600 పాయింట్లు) స్థానానికి చేరుకుంది. 

అలాగే వన్డే ఆల్‌రౌండర్ ర్యాంకింగ్స్‌లో ఒక స్థానం మెరుగుపర్చుకుని ఐదో స్థానంలో నిలిచింది. కివీస్ జట్టులోని బ్రూకీ హాలిడే 11వ స్థానంలో ఉండగా.. మాడీ గ్రీన్ 22వ స్థానానికి చేరుకుంది. ఇక ఉమెన్స్ టీ20 ర్యాంకింగ్స్‌లో శ్రీలంక బ్యాటర్ హాసిని పెరీరా అద్భుత ప్రదర్శనతో 15 స్థానాలు ఎగబాకి 28వ స్థానానికి చేరుకోగా.. దులానీ72వ స్థానంలో ఉంది. బౌలింగ్‌లో విభాగంలో పాకిస్థాన్ ప్లేయర్ సాదియా ఇక్బాల్ 743 పాయింట్లతో నెంబర్ వన్ ప్లేస్ లో కొనసాగుతుంది. ఆ తర్వాతి స్థానాల్లో అన్నాబెల్ సదర్లాండ్(729), సోఫీ ఎకల్‌స్టన్(727) నిలిచారు.