న్యూఢిల్లీ: లోక్ సభలో రాహుల్ వర్సెస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం నడిచింది. ప్రధాని మోడీ ట్రంప్‌కు లొంగిపోయారని రాహుల్ కామెంట్ చేయగా వెంటనే బీజేపీ ఈ వ్యాఖ్యలను తిప్పికొట్టింది. ప్రధాని మోడీ ఎప్పుడూ రాజీ పడలేదని కౌంటర్ ఇచ్చింది. బుధవారం (మార్చి 11) లోక్ సభలో స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగింది.
రాహుల్ గాంధీ ఈ చర్చలో పాల్గొని ప్రసంగించారు. లాస్ట్ సెషన్లో మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణే పుస్తకం, లైంగిక ఆర్థిక నేరస్తుడు జెఫ్రీ ఎప్స్టీన్లకు సంబంధించి ప్రధాని మోడీ రాజీపడ్డ విషయాలను ప్రస్తావిస్తే తనను మాట్లాడకుండా అడ్డుకున్నారని తెలిపారు. మేము మాట్లాడటానికి లేచిన ప్రతిసారీ స్పీకర్ మమ్మల్ని మాట్లాడకుండా ఆపేస్తున్నారని పేర్కొన్నారు.
లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడిని మాట్లాడటానికి అనుమతించకపోవడం ఇదే మొదటిసారి అని అసంతృప్తి వ్యక్తం చేశారు. లోక్‌సభ కేవలం ఒక రాజకీయ పార్టీ గొంతుక కాదని, భారత ప్రజల గొంతుక అని అన్నారు. సభలో ప్రతిపక్ష సభ్యులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయకుండా స్పీకర్ నిరోధిస్తున్నారని ఆరోపించారు.
మోడీ లొంగిపోయారన్న రాహుల్ వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ వెంటనే కౌంటర్ ఇచ్చారు. ప్రధాని మోడీ ఎప్పుడూ రాజీ పడలేదన్నారు. ప్రధానిపై ప్రతిపక్షాలు నిరాధార ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రతిపక్షాలు సభ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
