పవర్ స్టార్ పవర్ కళ్యాణ్, టాలీవుడ్ మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్' . ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, సినిమా విడుదల కావడానికి సరిగ్గా పది రోజుల ముందు హరీష్ శంకర్ అనూహ్యంగా ఒక వివాదంలో చిక్కుకున్నారు. సోషల్ మీడియాలో ఆయన చేసిన ఒక చిన్న రిప్లై, సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానుల ఆగ్రహానికి కారణమైంది.
అసలేం జరిగింది?
ఎక్స్ వేదికగా ఒక నెటిజన్ మహేష్ బాబు సినిమా కలెక్షన్లను పరోక్షంగా ఎగతాళి చేస్తూ ఒక పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్‌కు హరీష్ శంకర్ "తథాస్తు" అని రిప్లై ఇవ్వడంతో ఒక్కసారిగా దుమారం రేగింది. ఇది గమనించిన మహేష్ ఫ్యాన్స్, హరీష్ శంకర్‌ను టార్గెట్ చేస్తూ నెగటివ్ ట్రెండ్ మొదలుపెట్టారు. ఒక స్టార్ డైరెక్టర్ అయ్యుండి మరో స్టార్ హీరోను తక్కువ చేసేలా వ్యవహరించడం సరికాదని విమర్శలు గుప్పించారు.
హరీష్ శంకర్ క్లారిటీ..
పరిస్థితి తీవ్రతను గమనించిన హరీష్ శంకర్, వెంటనే స్పందిస్తూ ఒక సుదీర్ఘమైన నోట్‌ను విడుదల చేశారు. ఆ రోజు తానెంత బిజీగా ఉన్నారో వివరిస్తూ.. సెన్సార్ బోర్డు అధికారులతో మీటింగ్, పెద్దమ్మ గుడి సందర్శన, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పనులు, సాంగ్ ప్రోమో చెకింగ్.. ఇలా ఊపిరి సలపని పనుల్లో ఉన్నాను. ఆ హడావిడిలో అభిమానులు, జర్నలిస్టులు పంపిస్తున్న మెసేజ్‌లకు రిప్లై ఇస్తూ, ఒక ట్వీట్‌ను పూర్తిగా చదవకుండానే పొరపాటున కోట్ చేశాను అని పేర్కొన్నారు.
తన టీమ్ అప్రమత్తం చేయగానే నిమిషం వ్యవహారంలోనే ఆ ట్వీట్‌ను తొలగించానని ఆయన స్పష్టం చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు గారంటే నాకు అమితమైన గౌరవం. రాజమౌళి గారితో ఆయన చేయబోయే సినిమా 'వారణాసి' ఎన్నో రికార్డులను తిరగరాస్తుందని నేను నమ్ముతున్నాను. ఎవరినీ కించపరిచే ఉద్దేశం నాకు లేదు అని వివరణ ఇచ్చారు.
ఇలాంటి పిచ్చి పనులు చేస్తానా?
తన సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్' విడుదల దగ్గరపడుతున్న వేళ, కావాలని వివాదాలు కొనితెచ్చుకునేంత అవివేకిని కాదని హరీష్ శంకర్ వాపోయారు. ఏ సినిమాకైనా అన్ని వర్గాల ప్రేక్షకుల, అన్ని హీరోల అభిమానుల మద్దతు అవసరం. విడుదలకి పది రోజుల ముందు ఇలాంటి పోస్ట్‌లు పెట్టేంత కామన్ సెన్స్ లేని వాడిని కాను. నా వల్ల ఎవరి మనసైనా నొచ్చుకుంటే మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నాను అని ఆ నోట్‌లో రాసుకొచ్చారు. హరీష్ శంకర్ వివరణతో ఈ వివాదం సర్దుమణుగుతుందో లేదో చూడాలి. ఏదేమైనా, సోషల్ మీడియాలో చిన్న తప్పు కూడా ఎంత పెద్ద వివాదానికి దారితీస్తుందో ఈ ఘటన మరోసారి నిరూపించింది.
