గుడ్ న్యూస్.. న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ 31 రాత్రి హైదరాబాద్లో ఉచిత ప్రయాణ సేవలు

గుడ్ న్యూస్.. న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ 31 రాత్రి హైదరాబాద్లో ఉచిత ప్రయాణ సేవలు

న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్ సిటీ వాసులకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫాం వర్కర్స్ యూనియన్ (టిజిపిడబ్ల్యుయు). నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడపకుండా ఉండేందుకు ఉచిత ప్రయాణ సేవలను ప్రకటించింది యూనియన్. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది.

ఈ ఉచిత రైడ్ సేవలు డిసెంబర్ 31 రాత్రి 11:00 గంటల నుంచి జనవరి 1 రాత్రి 1:00 గంటల వరకు, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధుల్లో అందుబాటులో ఉంటాయి. 

న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా మద్యం మత్తులో వాహనాలు నడపడం డ్రైవర్లు,పాదచారులకు తీవ్రమైన ప్రమాదంగా మారుతోందని.. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు రోడ్డు ప్రమాదాలను నివారించి ప్రాణాలను కాపాడాలనే లక్ష్యంతో #HumAapkeSaathHai ప్రచారాన్ని ప్రారంభించామని టిజిపిడబ్ల్యుయు అధ్యక్షులు షేక్ సలాహుద్దీన్ తెలిపారు.

Also Read : ట్రాన్స్‌జెండర్లకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్

గత ఎనిమిది సంవత్సరాలుగా ప్రతి నూతన సంవత్సరం సందర్భంగా ఆటో రిక్షాలు, నాలుగు చక్రాల వాహనాల ద్వారా టిజిపిడబ్ల్యుయు ఉచిత రైడ్ సేవలను అందిస్తోందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.  ఈ సంవత్సరం, బిజ్లిరైడ్ తో భాగస్వామ్యం ద్వారా ఈ కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. 

ఈ కార్యక్రమంలో భాగంగా క్యాబ్స్, ఆటోలు, ఈవీ బైక్‌లు కలిపి మొత్తం 500 వాహనాలను వినియోగంలోకి తీసుకువస్తారు. మద్యం మత్తులో స్వయంగా ప్రయాణించలేని వారు 8977009804 నంబర్‌కు కాల్ చేసి ఈ ఉచిత రైడ్ సేవలను పొందవచ్చని ఆయన తెలిపారు.