న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ, ప్రముఖ వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా కుమారుడు రేహాన్ వాద్రా ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. తన ఆప్త మిత్రురాలు అవివా బేగ్ను రేహాన్ వివాహం చేసుకోనున్నాడు. ఏడేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట పెళ్లితో ఒక్కటి కాబోతోంది. కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో రేహాన్, అవివా నిశ్చితార్థం జరిగినట్లు తెలిసింది. అయితే.. ఈ నిశ్చితార్థం జరిగినట్లు ఇరు కుటుంబాలు ధృవీకరించలేదు.
రేహాన్ వాద్రా ఇటీవలే అవివాకు ప్రపోజ్ చేశాడని.. పెళ్లికి ఆమె కూడా సుముఖత వ్యక్తం చేయడంతో ఈ జంట నిశ్చితార్థం చేసుకున్నట్లు జాతీయ మీడియా చెప్పుకొచ్చింది. రెండు కుటుంబాలు వీరి ప్రేమకు అంగీకారం తెలిపి నిశ్చితార్థం కూడా జరిపించారని, త్వరలో పెళ్లి కూడా చేసుకుంటారని జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ప్రియాంక, రాబర్ట్ వాద్రాకు ఇద్దరు సంతానం. కొడుకు రేహాన్ వాద్రా, కూతురు మిరాయా వాద్రా. రేహాన్ వయసు 25 సంవత్సరాలు. మిరాయా వయసు 23 సంవత్సరాలు. రేహాన్ వాద్రా విజువల్ ఆర్టిస్ట్. వైల్డ్ లైఫ్, స్ట్రీట్, కమర్షియల్ ఫొటోగ్రఫీలో రేహాన్కు ఆసక్తి. చిన్నప్పటి నుంచి రేహాన్కు ఫొటోగ్రఫీ అంటే మక్కువ. అతని ఆసక్తిని గమనించిన తల్లి ప్రియాంకా ప్రోత్సహించడంతో అటు వైపుగా రేహాన్ అడుగులేశాడు.
రాజీవ్ గాంధీకి కూడా ఫొటోగ్రఫీ అంటే చాలా ఇష్టం కావడం గమనార్హం. తాతయ్య లానే మనవడికి కూడా ఫొటోగ్రఫీపై ఇష్టం ఏర్పడటం విశేషం. అవివా బేగ్ కూడా ఫొటోగ్రాఫర్ కావడంతో రేహాన్కు, ఈమెకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కొన్నాళ్లకు స్నేహంగా మారింది. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం కావడంతో ప్రేమలో పడిన ఈ జంట పెళ్లి వైపుగా అడుగులేయడం విశేషం.
