లక్కీ భాస్కర్ మూవీ తరహాలో.. రూ.3 కోట్లు కొట్టేసిన బ్యాంక్ ఉద్యోగి

లక్కీ భాస్కర్ మూవీ తరహాలో.. రూ.3 కోట్లు కొట్టేసిన బ్యాంక్ ఉద్యోగి

లక్కీ భాస్కర్ సినిమా గుర్తింది కదా.. బ్యాంకు డబ్బులు తీసుకుని వ్యాపారం చేస్తూ.. మేనేజర్లకు డౌట్ రాకుండా ఎస్కేప్ అవ్వడం.. కాస్త అటూ ఇటూగా అలాంటి స్టోరీనే కెనరా బ్యాంకులో జరిగింది. అది కూడా స్వయాన మేనేజర్ మూడు కోట్ల రూపాయలతో ఉడాయించడం సంచలనంగా మారింది. 

ఈ ఘటన బెంగళూరులో జరిగింది. కస్టమర్లను మోసం చేసి బ్యాంకు సీనియర్ మేనేజర్ రఘు 3 కోట్ల రూపాయలతో ఎస్కేప్ అయ్యాడు. తను ఫైనాన్షియ్ గా ఇబ్బందుల్లో ఉన్నానని.. కస్టమర్లకు లోన్లు ఇప్పిస్తానని.. అందుకు తనకు సహాయం చేయాలని కస్టమర్లను కోరాడు. తన దగ్గర ఉన్న బంగారంపై లోన్స్ తీసుకోవాలనుకున్నా.. బ్యాంక్ ఉద్యోగి కావడంతో టెక్నికల్ గా ఇబ్బందులు ఉన్నట్లు వాళ్లను నమ్మించాడు. తన పేరున లోన్స్ రావటం లేదని.. దానికి బదులుగా కస్టమర్లు తమ పేరున అప్లై చేయాల్సిందిగా కోరాడు

బ్యాంకు మేనేజర్ కావడంతో రఘును కస్టమర్లు నమ్మి లోన్ కు అప్లై చేశారు. 21 మంది కస్టమర్లు అప్లికేషన్ ఫామ్ పైన సంతకాలు చేసి ఇచ్చారు. దీంతో తనపని తాను కానిచ్చినట్లు పోలీసులు తెలిపారు. కస్టమర్ల సంతకాలతో కూడిన ఫామ్స్ ఉపయోగించి.. గోల్డ్ కుదువ పెట్టకుండానే లోన్లు డిస్బర్స్ చేసి.. ఆడబ్బుతో పరారైనట్లు చెప్పారు. 

బ్యాంకు లోన్స్ సెక్షన్ అధికారులు లోన్లు మిస్ మ్యాచ్ కావడంపై ఆడిట్ జరిపారు. దీంతో రఘు భారీ మొత్తం లోన్లు డిస్బర్స్ చేసి పరారైనట్లు గుర్తించారు. సంతకాలు పెట్టిన కస్టమర్లను రిస్కులో పడేసి ఉడాయించాడు. 

కస్టమర్లను నమ్మించి.. మేనేజర్ గా పనిచేస్తున్న సొంత బ్యాంకు నుంచి కోట్ల రూపాయలు కొల్లగొట్టిన మేనేజర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు బ్యాంకు అధికారులు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పారిపోయిన మేనేజర్ కోసం సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.