హైదరాబాద్లో జింక మాంసం అమ్ముతూ దొరికారు.. కిలో ఎంతకు అమ్మారంటే..

హైదరాబాద్లో జింక మాంసం అమ్ముతూ దొరికారు.. కిలో ఎంతకు అమ్మారంటే..

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా అత్తాపూర్లో జింక మాంసం విక్రయం కలకలం రేపింది. సులేమాన్ నగర్లో జింక మాంసం అమ్ముతున్న మహ్మద్ ఇర్ఫానుద్దీన్ను రాజేంద్ర నగర్ SOT పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని దగ్గర నుంచి 15 కిలోల జింక మాంసం, జింక తోలు, తలతో పాటు 3 వేల 500 నగదు స్వాధీనం చేసుకున్నారు.

నల్లమల అటవీ ప్రాంతంలో వేటాడి.. వనపర్తి జిల్లా పెబ్బేరు నుంచి హైదరాబాద్కు జింకలను తీసుకువచ్చి, స్థానికంగా వధించి కిలో 800 రూపాయల చొప్పున నిందితుడు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. రాజేంద్ర నగర్ SOT పోలీసులు నిందితుడిని అత్తాపూర్ పోలీసులకు అప్పగించారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 

సెప్టెంబర్, 2025లో కూడా హైదరాబాద్లో జింక మాంసం పట్టుబడడం క‌‌‌‌ల‌‌‌‌క‌‌‌‌లం సృష్టించిన సంగతి తెలిసిందే. టోలిచౌకిలో10 కిలోల జింక మాంసాన్ని తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు వివరాలను సౌత్ వెస్ట్ జోన్  డీసీపీ చంద్రమోహన్ వెల్లడించారు. టోలిచౌకి సబ్జా కాలనీకి చెందిన డాక్టర్  మహ్మద్ సలీమ్ మూస (47),  బజార్ ఘాట్  నాంపల్లికి చెందిన మహ్మద్  ఇక్బాల్  కలిసి జహీరాబాద్  ఫారెస్ట్  ఏరియా నుంచి జింక మాంసం తీసుకొచ్చారు.

డాక్టర్  సలీమ్  నివాసం ఉంటున్న అపార్ట్​మెంట్  నుంచి ఈ మాంసాన్ని సెప్టెంబర్ 13 రాత్రి తన ఫ్రెండ్ ఇంట్లో పార్టీ  చేసుకోవడానికి తీసుకెళ్తుండగా.. పోలీసులకు సమాచారం అందింది. టోలిచౌకి ఇన్​స్పెక్టర్  రమేశ్ నాయక్  ఆధ్వర్యంలో పోలీసులు.. నిందితులను పట్టుకున్నారు. వారి వద్ద  నుంచి 10 కిలోల జింక మాంసం, మూడు జింక కొమ్ములతో పాటు లైసెన్స్  ఉన్న ఐదు రైఫిల్స్, బొలెరో వాహనాన్ని సీజ్  చేశారు. వన్యప్రాణి రక్షణ చట్టం, 1972 చట్టం కింద నిందితులపై కేసు నమోదుచేసి ఫారెస్టు అధికారులకు అప్పగించారు.