తైవాన్ జలసంధి చుట్టూ చైనా యుద్ధ విన్యాసాలు

తైవాన్ జలసంధి చుట్టూ చైనా యుద్ధ విన్యాసాలు

బీజింగ్: తైవాన్ జలసంధి చుట్టూ చైనా భారీ యుద్ధ విన్యాసాలు చేపట్టింది. సోమవారం "జస్టిస్ మిషన్ 2025" పేరుతో మొదలైన విన్యాసాలు మంగళవారం కూడా కొనసాగనున్నాయి. ఇందులో చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్‌‌ఏ), నేవీ, ఎయిర్ ఫోర్స్, రాకెట్ ఫోర్స్ దళాలు పాల్గొంటున్నాయి.  తైవాన్ చుట్టూ ఉన్న సముద్రంలోని యుద్ధనౌకలు, తైవాన్ భూమిపై ఎయిర్ డిఫెన్స్ సైట్లు, కమాండ్ సెంటర్లు, రన్‌‌వేలపై అటాక్ చేయటమే లక్ష్యంగా డ్రాగన్ సైనికులు దాడులు ప్రాక్టీస్ చేస్తున్నారు. 

తైవాన్‌‌లోని వేర్పాటువాద శక్తులకు ఇది బలమైన హెచ్చరికని.. జాతీయ సమైక్యత, సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి తగిన చర్యలు తీసుకుంటామని  చైనాకు చెందిన పీఎల్‌‌ఏ ఈస్టర్న్‌‌ థియేటర్‌‌ కమాండ్‌‌ సీనియర్‌‌ కర్నల్‌‌ షి యీ పేర్కొన్నారు. కాగా.. జపాన్ ప్రధాని సనే తకైచి ఇటీవల పార్లమెంటులో మాట్లాడుతూ.. ఒకవేళ తైవాన్‌‌పై చైనా దాడికి దిగితే, తైవాన్‌‌ను కాపాడేందుకు తాము జోక్యం చేసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. తైవాన్, జపాన్ భద్రత వేరువేరుకాదన్నారు. ఈ వ్యాఖ్యలపై చైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి ప్రతిచర్యగానే తాజాగా తైవాన్ చుట్టూ చైనా తన సైనిక బలగాలను భారీగా మోహరించింది.