- రక్షకుడిగా ప్రజలను కాపాడుతా.. టీవీకే చీఫ్ విజయ్ వెల్లడి
- అధికారమిస్తే సామాజిక న్యాయం అందిస్తామని హామీ
సేలం: తమిళనాడుకు సైనికుడిగా, ప్రజలకు రక్షకుడిగా ఉండి కాపాడతానని టీవీకే చీఫ్ విజయ్ అన్నారు. తన రాజకీయ ప్రవేశం రాష్ట్రంలోని రాజకీయాలను కుదిపేస్తోందని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం సేలనాయ్ కెన్ పట్టిలో నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. పవర్ షేరింగ్ పై విక్రవాండీ సభలో తాను చేసిన ప్రకటనతో రాష్ట్రంలోని రాజకీయ పార్టీల్లో బాంబు పడినట్లయిందని, ఇప్పుడు ఆ బాంబు అన్ని కూటముల్లోనూ పేలుతోందన్నారు. పవర్ షేరింగ్ ప్రకటనతో ముఖ్యమంత్రి స్టాలిన్ కలవరపడుతున్నారని ఎద్దేవా చేశారు.
తాను రాజకీయ ప్రవేశం చేసినా ఇంట్లోనే కూర్చున్నానంటూ కొంతమంది విమర్శిస్తున్నారని, కానీ.. తమిళనాడు మొత్తం తన ఫ్యామిలీ అన్నారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీని గెలిపిస్తే సామాజిక న్యాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా అధికార డీఎంకేపై ఆయన విమర్శలు చేశారు. ఎన్నికల్లో గెలవడానికే కూటమిని డీఎంకే వాడుకుంటుందని, డబ్బులు పంచి గెలిచాక కూటమిని పక్కనపెట్టిందని ఆరోపించారు. తాను రాజకీయ ప్రవేశం చేసినందున, ఇక డబ్బులు పంచి గెలవడం కుదరదన్నారు.
‘‘వారు (డీఎంకే) డబ్బుల సంచులతో వస్తారు. దేవుడి పేరు చెప్పి తమ పార్టీకే ఓటు వేయాలని మీ నుంచి మాట తీసుకుంటారు. చాలా ఏండ్లుగా రాష్ట్రంలో ఇదే తంతు జరుగుతోంది. ఈసారి అలా జరగరాదు. వారు ఇచ్చే డబ్బులు తీస్కోండి. కానీ, ఓటు మాత్రం విజిల్ గుర్తుకే వేయండి. విజిల్ తీసుకొని గట్టిగా వారి చెవుల్లో ఊది తరిమేయండి” అని విజయ్ వ్యాఖ్యానించారు. కాగా, డబ్బులతో ఓట్లను కొనే సంప్రదాయ అంతం కావాలని విజయ్ అన్నారు. ఓటుకు అమ్ముడుపోబోమంటూ సభకు వచ్చిన జనంతో ప్రతిజ్ఞ చేయించారు.
ర్యాలీలో గుండెపోటుతో ఒకరి మృతి
సభకు హాజరైన వారిలో ఒక వ్యక్తి గుండెపోటుతో చనిపోయాడు. అతడిని మహారాష్ట్రకు చెందిన సూరజ్ (37) గా గుర్తించారు. సభకు విజయ్ చేరుకునే ముందే ఈ ఘటన జరిగింది.
