చిన్న పార్టీలు, ఇండిపెండెంట్ల విజయం.. రెండు చోట్ల ఖాతా తెరి చిన జనసేన

చిన్న పార్టీలు, ఇండిపెండెంట్ల విజయం.. రెండు చోట్ల ఖాతా తెరి చిన జనసేన
  •     మంచిర్యాల, హుజూర్ నగర్​లో గెలుపు
  •     మధిరలో గెలిచిన ముగ్గురు టీడీపీ మద్దతుదారులు

హైదరాబాద్, వెలుగు: మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో జనసేన, టీడీపీ మద్దతుదారులు, ఇండిపెండెంట్లు పలు చోట్ల విజయం సాధించారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలను దీటుగా ఎదుర్కొని గెలుపొందారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నియోజకవర్గంలో టీడీపీ మద్దతు ఇచ్చిన ముగ్గురు అభ్యర్థులు విజయం సాధించారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలోని నేరేడుచర్ల మున్సిపాలిటీలో 14 వార్డులో జనరల్ సీటు నుంచి జనసేన అభ్యర్థి ఆరూరి విజయలక్ష్మి గెలుపొందారు.

మంచిర్యాల కార్పొరేషన్ లో 34 వ డివిజన్ లో జనసేన అభ్యర్థి అగ్గు సాగర్ గెలుపొందారు.  ఇక చాలా మున్సిపాలిటీల్లో చైర్మన్, చైర్ పర్సన్ సీటుకు సరిపడా మెజారిటీ రాని చోట్ల ఇండిపెండెంట్లు కీలకం కానున్నారు. జగిత్యాల, జనగామ, బైంసా, కొత్తగూడెం కార్పొరేషన్ ఇలా రాష్ట్రం మొత్తం 181 మంది ఇండిపెండెంట్లు గెలిచినట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది.

టికెట్ రాకపోతే ఇండిపెండెంట్లుగా పోటీ

రాష్ట్రంలో ప్రధాన పార్టీల నుంచి పోటీ చేయాలని భావించి టికెట్ రాని అభ్యర్థులు ఇండిపెండెంట్లు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ( ఏఐఎఫ్ బీ) నుంచి పోటీ చేశారు. అయితే, ఇండిపెండెంట్లుగా చాలా మంది గెలిచినప్పటికీ ఏఐఎఫ్ బీ గుర్తుమీద పోటీ చేసిన తెలంగాణ జాగృతి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. పెద్దపల్లి మున్సిపాలిటీలో ఏఐఎఫ్ బీ 5 సీట్లు గెలిచింది. ఇక సీపీఎం 13 చోట్ల విజయం సాధించింది. బీఎస్పీ మెదక్ లో ఒక సీటు, అలియాబాద్ (మేడ్చల్) లో రెండు చోట్ల గెలిచింది. నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీలో ట్రాన్స్ జెండర్ నాగిళ్ల కావేరి (సుధాకర్) గెలుపొందారు. 

ఒక్క  ఓటుతో గెలుపు

కల్వకుర్తి మున్సిపాలిటీలోని పదో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి ఎజాస్ ఒక్క ఓటుతో విజయం సాధించారు. మొదటిసారి ఓట్ల లెక్కింపులో రెండు ఓట్లు మెజార్టీ రావడంతో రీకౌంటింగ్ చేయగా.. ఒక్క ఓటుతో కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు.  పరకాలలోనూ కాంగ్రెస్ అభ్యర్థి ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు. పరకాల మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి  సుభద్ర- సాల్మన్, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శనిగరపు రజిని -నవీన్ పై ఒక్క ఓటుతో గెలుపొందారు.