బషీర్బాగ్, వెలుగు: మున్సిపల్ ఎన్నికల ఫలితాలే జీహెచ్ఎంసీలో రిపీట్ అవుతాయని ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు మోతె రోహిత్ ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఘన విజయం సాధించడంతో హిమాయత్ నగర్ లో కాంగ్రెస్ నాయకులతో కలిసి సంబురాలు చేసుకున్నారు. సీఎం ఫొటోకు పాలాభిషేకం చేసి, పటాకులు పేల్చి, స్వీట్లు పంచుకున్నారు. ఈ రెండేండ్లలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు ఈ ఫలితాలు రెఫరెండమన్నారు.
సంక్షేమ పథకాలే గెలిపించాయి
ముషీరాబాద్: మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడంపై టీపీసీసీ సికింద్రాబాద్ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు కరణం సురేశ్ హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం రాంనగర్లో జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్లే ప్రజలు కాంగ్రెస్కు పట్టం కట్టారని తెలిపారు. ఇదే ఉత్సాహంతో రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ నాయకత్వంలో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
