- పెండింగ్ పనులు, భూసేకరణకు తక్షణమే 194 కోట్లు విడుదల చేస్తున్నం: డిప్యూటీ సీఎం భట్టి
- మేం ఉన్నది కేటీఆర్, హరీశ్చెప్పినట్టు చేసేందుకు కాదు
- ఎన్‌డీఎస్ఏ, సీడబ్ల్యూసీ నివేదికల ప్రకారమే కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ ఉంటుందని వెల్లడి
- పదేండ్లలో దేవాదుల, సీతారామ ఎందుకు కట్టలే?: మంత్రి ఉత్తమ్
- వరద నీటితో లిఫ్ట్ చేయాలంటున్నరు.. మరి బ్యారేజీలు ఎందుకు నిర్మించారు?: మంత్రి పొంగులేటి
- దేవాదుల ప్రాజెక్టు పరిశీలన.. అక్కడే అధికారులతో మంత్రుల సమీక్ష
ములుగు/ఏటూరునాగారం, వెలుగు: బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన దేవాదుల ప్రాజెక్టును రాబోయే రెండేండ్లలో పూర్తిచేసి 6 లక్షల ఎకరాల ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీళ్లిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఇందులో భాగంగా పెండింగ్‌పనులు, భూసేకరణకు తక్షణమే రూ.194 కోట్లు విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. సోమవారం ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం సమ్మక్క సాగర్ ప్రాజెక్టును మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి భట్టి విక్రమార్క పరిశీలించారు.
అనంతరం తుపాకులగూడెం సమీపంలోని జె. చొక్కారావు దేవాదుల ప్రాజెక్టు వాటర్ పాయింట్ చేరుకొని, మోటార్ల పనితీరు, లిఫ్ట్ కెపాసిటీని భట్టి అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్ట్ పెండింగ్ పనులు, భూసేకరణ తదితర అంశాలపై రివ్యూ చేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. దేవాదుల ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అధికారులు దృష్టికి తెచ్చిన భూసేకరణ, పెండింగ్వర్క్స్కోసం రూ.146 కోట్లు, నిర్వహణ కోసం మరో రూ.48 కోట్లను రిలీజ్చేస్తున్నట్టు వెల్లడించారు. ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో 10 మోటార్ల ద్వారా నీటిని లిఫ్ట్ చేసి.. 22 రిజర్వాయర్లలో పూర్తిస్థాయిలో నీళ్లు ఉండేలా చూస్తామన్నారు. దేవాదుల ప్రాజెక్టు పూర్తి కెపాసిటీ 38.16 టీఎంసీలను వినియోగిస్తామని, 6 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందిస్తామని చెప్పారు. ప్రాజెక్టు పూర్తి చేసేందుకు మరో 2,180 ఎకరాల భూసేకరణ జరగాల్సి ఉందని తెలిపారు.
ఎన్డీఎస్ఏ, సీడబ్ల్యూసీ నివేదికల ప్రకారమే..
కాళేశ్వరంపై బీఆర్ఎస్ నాయకులు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని భట్టి విక్రమార్క ఫైర్అయ్యారు. ‘‘కేటీఆర్, హరీశ్చెప్పారని మేం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో నీళ్లు నింపం. సీడబ్ల్యూసీ, నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ అధికారులు, సాంకేతిక నిపుణులు ఇచ్చిన మార్గదర్శకాలకు తగ్గట్టుగానే ముందుకెళ్తాం’’ అని స్పష్టం చేశారు. నిపుణుల సూచనల మేరకు వచ్చే వేసవిలో పనులు మొదలుపెడతామని చెప్పారు.
రిపేర్లు పూర్తయ్యేంత వరకు గేట్లు మూసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. నీటిని లిఫ్ట్ చేయాలంటే మేడిగడ్డలో 5 టీఎంసీలు, అన్నారంలో 10 టీఎంసీలు, సుందిళ్లలో 8 టీఎంసీల నీటిని నిల్వ చేయాల్సి ఉంటుందని, పంపుల దాకా వాటర్లెవెల్స్ అందుకోవాలంటే గేట్లు మూయాలని, గేట్లు మూస్తే బ్యారేజీలు కొట్టుకుపోయే ప్రమాదం ఉందన్నారు. ‘‘సాంకేతికంగా డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పిన మాటలు వినాలా? ప్రతిపక్షాల గాలి మాటలు విందామా?’’ అని ప్రశ్నించారు.
రీడిజైన్ల పేరుతో రాష్ట్ర ప్రజల సొమ్ము లూటీ: మంత్రి ఉత్తమ్
సాగునీటి ప్రాజెక్టులపై పదేండ్లలో రూ.1.18 లక్షల కోట్లు ఖర్చు చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం.. కాళేశ్వరం, సీతారామసాగర్ ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. రీ డిజైన్ల పేరుతో రాష్ట్ర ప్రజల సొమ్మును లూటీ చేశారని ఆరోపించారు. దేవాదుల ప్రాజెక్టులోని 10 పంపుల్లో 7 పంపులు పని చేస్తున్నాయని, ఒకటి రెండు రోజుల్లో అన్ని పంపులు పని చేసేలా చర్యలు తీసుకోవాలని ములుగు, వరంగల్ చీఫ్ ఇంజనీర్లను ఆదేశించారు. కెపాసిటీకి తగ్గట్టుగా నీటిని ఎత్తిపోసి ప్రాజెక్టు మొత్తం ఆయకట్టుకు సాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కొత్త ఆయకట్టు, స్థిరీకరించిన ఆయకట్టుకు నీరందేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల నుంచి ఒక్క చుక్క నీరు ఎత్తిపోయకుండానే, తెలంగాణ చరిత్రలోనే అత్యధిక విస్తీర్ణంలో పంటలు సాగు చేసి దిగుబడులు సాధించామని తెలిపారు. యాసంగిలో 84 లక్షల టన్నుల వడ్లను సేకరించి, రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశామని చెప్పారు.
కాళేశ్వరంలో నాణ్యతా లోపాలు: మంత్రి పొంగులేటి
కమీషన్లకు కక్కుర్తి పడి నాణ్యత లేని పనులు చేయడంతోనే కాళేశ్వరం పిల్లర్లు కుంగిపోయాయని, సాంకేతిక నిపుణుల సూచనల మేరకు మాత్రమే తాము ముందుకెళ్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. వరద నీటితో నీటిని లిఫ్ట్ చేయొచ్చని చెబుతున్న బీఆర్ఎస్ నేతలు బ్యారేజీలు ఎందుకు నిర్మించారో? ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.
దేవాదుల ప్రాజెక్టు ద్వారా 6.14 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే అవకాశం ఉందన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ప్రాజెక్టును సందర్శించి.. ఏడాది వ్యవధిలో పూర్తి చేయాలని స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించారని గుర్తు చేశారు. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ములుగు కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్, ఐటీడీఏ పీవో లెనిన్ వస్సల్ టోప్పో పాల్గొన్నారు.
