తిరుపతి ఉపాధ్యాయ నగర్ శివారుల్లో చిరుత సంచారం కలకలం రేపింది. చిరుతను చూసి స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ఇప్పటికే ఆ ప్రాంత వాసులను అటవీశాఖ అధికారులు అప్రమత్తం చేశారు. పలు సూచనలు చేస్తూ బ్యానర్ ఏర్పాటు చేశారు. బ్యానర్‌తో పాటు అదే ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న అటవీశాఖ సిబ్బంది, చిరుత కదలికలను గుర్తించేలా ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు.
చిరుత సంచారం నేపథ్యంలో రాత్రి 7 గంటల తర్వాత ఎవరూ బయటకు రావద్దని అటవీ శాఖ అధికారులు స్థానికులను హెచ్చరించారు. తరచూ ఒకే ప్రాంతానికి వస్తున్న చిరుతను బంధించాలని స్థానికుల డిమాండ్ చేస్తున్నారు. ఏ సమయంలో చిరుత దాడి చేస్తుందోనని స్థానికులు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు.
