హైదరాబాద్: మనువళ్లు, మనువరాళ్లతో సరదాగా జీవితం గడపాల్సిన వయస్సులో పురుగుల మందు తాగి వృద్ధ దంపతుల ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద ఘటన తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. బచ్చన్నపేట మండలం చిన్నరామచర్ల గ్రామానికి చెందిన పూర్మ రామ్ రెడ్డి (70), లక్మి ( 65) భార్యాభర్తలు.
గతకొంత కాలంగా వీరు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే జీవితంపై విరక్తి చెంది పురుగుల మందు తాగి ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఏడు పదుల వయసులో రామ్ రెడ్డి దంపతులు ఆత్మహత్య చేసుకోవడం గ్రామంలో తీవ్ర విషాదం నింపింది. దశాబ్దాల దాంపత్య జీవితంలో ఒక్కటిగాసాగిన ఆ దంపతులు మృత్యువులోనూ విడిపోకుండా కలిసి సాగారు.
