2026లో ఇండియా, పాక్ మధ్య మళ్లీ యుద్ధం..? అమెరికా సంస్థ సంచలన నివేదిక

2026లో ఇండియా, పాక్ మధ్య మళ్లీ యుద్ధం..? అమెరికా సంస్థ సంచలన నివేదిక

వాషింగ్టన్: నూతన సంవత్సరం వేళ అమెరికాకు చెందిన కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్ (CFR) సంస్థ సంచలన నివేదిక వెల్లడించింది. 2026లో ఇండియా, పాకిస్తాన్ మధ్య మరోసారి యుద్ధం సంభవించవచ్చని హెచ్చరించింది. పెరుగుతున్న ఉగ్రవాద కార్యకలాపాలు ఇరుదేశాల మధ్య మరోసారి సాయుధ సంఘర్షణకు దారి తీయొచ్చని సీఎఫ్ఆర్ అంచనా వేసింది. 2025 మే నెలలో ఇండియా, పాక్ మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించడానికి ట్రంప్ పరిపాలన బృందం ప్రయత్నించిందని షాకింగ్ విషయాన్ని పేర్కొంది. 

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఇదే పాట పాడుతోన్న విషయం తెలిసిందే. ఇండియా, పాక్ మధ్య తానే ఆపానంటూ ట్రంప్ పదే పదే సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటుండగా.. ఆ దేశ స్వతంత్ర దర్యాప్తు సంస్థ కూడా ఇదే విషయాన్ని హైలెట్ చేయడం గమనార్హం. మరోవైపు ట్రంప్ వ్యాఖ్యలను ఇండియా ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ వస్తోంది. ఇండియా, పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంలో మూడో వ్యక్తి లేదా దేశ ప్రమేయం లేదని.. ద్వైపాక్షిక చర్చల ద్వారానే సీజ్ ఫైర్ అగ్రిమెంట్ కుదిరిందని భారత్ స్పష్టం చేసింది. 

జమ్మూ కాశ్మీర్‎లోని పహల్గాంలో 2025, ఏప్రిల్ 22న పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు మారణహోమం సృష్టించిన విషయం తెలిసిందే. పహల్గాంలోని పచ్చని ప్రకృతి అందాలు తిలకిద్దామని వచ్చిన పర్యాటకులపై పాక్ ఉగ్రమూకలు బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ టెర్రర్ ఎటాక్‎లో మొత్తం 26 మంది ప్రాణాలు కోల్పోయారు. 

దీంతో ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తోన్న పాకిస్థాన్‎కు తగిన బుద్ధి చెప్పేందుకు ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్, పీవోకేలోని ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసేందుకు 2025, మే 10న ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఈ ఆపరేషన్‎లో భాగంగా పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి మరీ భారత సైన్యం దాడులు చేసి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. 

ఆపరేషన్ సిందూర్‎కు కౌంటర్ పాక్ ప్రతీకార దాడులకు దిగింది. దీంతో ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. నాలుగు రోజుల పాటు సైనిక ఘర్షణల అనంతరం ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఈ తరుణంలో 2026లో ఇండియా, పాక్ మధ్య మరోసారి యుద్ధం జరగొచ్చనే అమెరికా సంస్థ నివేదిక తీవ్ర చర్చనీయాంశంగా మారింది.