- ఎంపీలు తనను కానీ.. విద్యార్థులను కానీ కలవాలని డిమాండ్
- విద్యార్థులు శాంతియుతంగా ఆందోళన చేస్తున్నా వారిపై లాఠీచార్జ్ చేయడం కలచివేసిందని కామెంట్
న్యూఢిల్లీ: లడఖ్‌కు చెందిన సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ తన నిరాహార దీక్షను కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వాంగ్‌చుక్.. 23వ రోజు కూడా తన దీక్షను కొనసాగిస్తూ తన చేతితోనే ఒక నోట్ రాశారు. ఈ సందేశాన్ని ఆయన భార్య గీతాంజలి ఆంగ్మో సోషల్ మీడియాలో షేర్ చేశారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని శాంతియుతంగా నిరసన చేపట్టిన యువత పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారని వాంగ్‌చుక్ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు శాంతియుతంగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం రెచ్చగొట్టే చర్యలకు పాల్పడడం తనను కలచివేసిందని చెప్పారు. పార్లమెంటు ముందు తమ ఆవేదనను విన్నవించుకోవడానికి విద్యార్థులకు ప్రభుత్వం వెంటనే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. యువజన నేతలు పార్లమెంటులో ఎంపీలను కలవడానికి అనుమతించే వరకు లేదా ఎంపీలు ఆసుపత్రికి వచ్చి తనను కలిసే వరకు నిరాహారదీక్ష ఆపేది లేదని వాంగ్‌చుక్ తెగేసి చెప్పారు.
వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితిపై అఫిడవిట్ ఇవ్వండి
సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి నుంచి వాంగ్‌చుక్‌ను మేదాంత ఆసుపత్రికి తరలించేందుకు సింగిల్ జడ్జి నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ ఆయన భార్య ఢిల్లీ హైకోర్టులో అప్పీల్ చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ, జస్టిస్ తేజస్ కారియాల డివిజన్ బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది. కేవలం రక్త పరీక్షలు లేదా పాథాలజీ నివేదికల ఆధారంగా రోగి ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయలేమని, రోగి ప్రత్యక్ష ఆరోగ్య పరిస్థితిని కూడా చూడాలని స్పష్టం చేసింది. అందువల్ల సఫ్‌దర్‌జంగ్, ఎయిమ్స్, ప్రైవేట్ ల్యాబ్‌లు ఇచ్చిన నివేదికలతో పాటు వాంగ్‌చుక్ ఆరోగ్య బులిటెన్లను అఫిడవిట్ రూపంలో సమర్పించాలని సఫ్దర్‌జంగ్ అధికారులను హైకోర్టు ఆదేశించింది.
