కరీంనగర్, వెలుగు: ఎల్నినో ప్రభావంతో ఏర్పడే వర్షాభావ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'తెలంగాణ జలసిరి' కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాలని కరీంనగర్ కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులకు పిలుపునిచ్చారు. వీబీజీ రామ్-జీ పథకం కింద గ్రామాల్లో ఇంకుడుగుంతలు, ఊట కుంటలు, పంట కుంటలు, బోరు బావుల రీఛార్జ్ నిర్మాణాలు చేపట్టి ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. కలెక్టరేట్ లో సోమవారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జలసిరి పోస్టర్లను అధికారులతో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వినియోగించాలని కోరారు. రానున్న రోజుల్లో నీటి కొరతను ఎదుర్కొనేందుకు ప్రతి వర్షపు చుక్కను భూమిలోకి ఇంకించి భూగర్భ జలాలను పరిరక్షించాలన్నారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ అనిల్ కుమార్, అడిషనల్ కలెక్టర్లు శ్రీనివాస్ రెడ్డి, అశ్విని తానాజీ, డీపీవో జగదీశ్వర్, డీఆర్డీవో గీత, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్ లో ఉంచొద్దు
ప్రజావాణి వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్వరం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణిలో అధికారులతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మొత్తం 313 దరఖాస్తులు వచ్చి నట్లు చెప్పారు.
