తెలంగాణలో వ్యవసాయ సంక్షోభం ఏర్పడింది : మల్లు రవి

తెలంగాణలో వ్యవసాయ సంక్షోభం ఏర్పడింది : మల్లు రవి
  • రైతులను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి : మల్లు రవి

న్యూఢిల్లీ, వెలుగు: వర్షాభావ పరిస్థితుల వల్ల తెలంగాణలో వ్యవసాయ సంక్షోభం ఏర్పడిందని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఫోరం కన్వీనర్ మల్లు రవి అన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి రాష్ట్ర రైతులను ఆదుకోవాలని కోరారు. సోమవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌‌‌‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో జులై 16 నాటికి 243.4 మి.మీ సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, కేవలం 159.1 మి.మీ మాత్రమే నమోదైనట్లు వివరించారు.

దీంతో 35 శాతం లోటు వర్షపాతం నమోదైందని తెలిపారు. ఈ అంశాన్ని పార్లమెంట్ 'జీరో అవర్'లో కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు నోటీసు ఇచ్చినట్లు పేర్కొన్నారు. అయితే, సభ పదేపదే వాయిదా పడటంతో మాట్లాడే అవకాశం దక్కలేదన్నారు. 

నీట్ అక్రమాలపై చర్చ జరపాలి: చామల

నీట్ పేపర్ లీక్‌‌‌‌పై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నీట్ అక్రమాలపై లోక్‌‌‌‌సభలో చర్చ జరపాల ని కోరుతూ ఆయన వాయిదా తీర్మానం ఇచ్చారు. ఈ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.