భోపాల్: దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా ఎన్నో అవార్డులు అందుకున్న ఇండోర్ సిటీలో దారుణం జరిగింది. భగీరత్‌పుర ప్రాంతంలో కలుషిత నీరు తాగి ఏడుగురు మరణించారు. మరో 40 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. మంచినీటి పైప్‌లైన్ లీకేజీ అయ్యి అందులో మురుగునీరు కలవడంతో కలుషితమైన నీరు ఇళ్లకు చేరినట్లు అధికారులు గుర్తించారు. డిసెంబర్ 24 నుంచి వాంతులు, విరేచనాల కేసులు గణనీయంగా పెరిగాయి.
ప్రస్తుతం 40 మందికి పైగా అనారోగ్యంతో చికిత్స పొందుతుండగా.. ఇప్పటివరకు 1000 మందికి పైగా ప్రజలు ట్రీట్మెంట్ పొందారు. భగీరత్‌పుర ప్రాంతంలోని సంజీవని క్లినిక్‌లలో రోగుల రద్దీ విపరీతంగా పెరిగింది. కలుషిత నీరు తాగి వాంతులు, విరేచనాలతో స్థానికులు ఆసుపత్రికి క్యూ కట్టారు. దేశంలోనే క్లీనెస్ట్ సిటీగా పేరొందిన ఇండోర్‌లో కలుషిత నీరు తాగి ఏడుగురు చనిపోవడం చర్చనీయాంశంగా మారింది.
ఈ ఘటనపై సీఎం మోహన్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున నష్ట పరిహారం ప్రకటించారు. అనారోగ్యానికి గురైన వారికి మెరుగైన వైద్య సహయం అందించాలని సూచించారు. ఈ ఘటనకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
►ALSO READ | ఈ గంజాయి ఏంటి.. ఇలా ఉంది..? రూ.3 కోట్ల సరుకు దొరికింది.. హైడ్రోపోనిక్ గాంజా అంటే ఏంటంటే..
సీఎం ఆదేశాల మేరకు ఒక జోనల్ ఆఫీసర్, ఒక అసిస్టెంట్ ఇంజనీర్‌ను సస్పెండ్ చేశారు. ఒక సబ్ ఇంజనీర్ ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ ఘటనపై దర్యాప్తుకు ముగ్గురు సభ్యుల విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
