ప్రపంచ ఆర్థిక రంగంలో భారత్ మరో చారిత్రాత్మక మైలురాయిని అధిగమించింది. జపాన్‌ను వెనక్కి నెట్టి, భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. తాజా డేటా ప్రకారం.. భారత GDP వృద్ధి రేటు స్థిరంగా కొనసాగుతుండటంతో, దశాబ్దాలుగా అగ్రస్థానంలో ఉన్న జపాన్ ఐదవ స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం అమెరికా, చైనా, జర్మనీలు మాత్రమే భారత్ కంటే ముందున్నాయి.
భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ప్రధానంగా దేశీయ వినియోగం పెరగడం, మౌలిక సదుపాయాల రంగంలో భారీ పెట్టుబడులు, తయారీ రంగం పుంజుకోవడం వంటివి కీలక కారణాలుగా ఉన్నాయి. ముఖ్యంగా డిజిటల్ ఎకానమీలో వచ్చిన మార్పులు, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ భారత్‌ను ప్రపంచ వేదికపై శక్తివంతంగా నిలబెట్టాయి. మరోవైపు జపాన్ జనాభా తగ్గిపోవడం, కరెన్సీ విలువ పడిపోవడం వంటి సమస్యలతో నెమ్మదించడం భారత్‌కు కలిసొచ్చింది.
అయితే.. భారత లక్ష్యం ఇక్కడితో ఆగిపోలేదు. 2026 నాటికి జర్మనీని కూడా వెనక్కి నెట్టి, ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారత్ ప్రస్తుత వృద్ధి రేటు సుమారు 7 శాతం తీరున కొనసాగితే, వచ్చే రెండు ఏళ్లలో టాప్ 3లో చేరడం ఖాయమని ఆర్థిక నిపుణుల విశ్లేషణల అంచనా వేస్తున్నారు. ఈ ఘనత సాధిస్తే, ఆసియా ఖండంలో చైనా తర్వాత అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారత్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటుంది.
ఈ ఎదుగుదల కేవలం అంకెల్లోనే కాకుండా.. సామాన్యుల కొనుగోలు శక్తి పెరగడం, మరిన్ని ఉద్యోగ అవకాశాల సృష్టికి దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రపంచ దేశాలు ఇప్పుడు భారత్‌ను ఒక సురక్షితమైన.. అలాగే వేగంగా అభివృద్ధి చెందుతున్న పెట్టుబడి కేంద్రంగా చూస్తున్నాయి. ఈ పరిణామాలు భారత ఆర్థిక వ్యవస్థను కొత్త శిఖరాల దిశగా నడిచేందుకు దోహదపడుతున్నాయి.
