భువనేశ్వర్ బిజు పట్నాయక్ ఎయిర్ పోర్ట్‌లో మూడు కోట్లకు పైగా విలువ చేసే హైడ్రోపోనిక్ గాంజా పట్టుబడింది. బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికుడి లగేజీ బ్యాగేజ్లో రెవిన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు ఈ గాంజాను గుర్తించారు. పట్టుబడ్డ హైడ్రోపోనిక్ గాంజా 3.93 కేజీలు. దాని విలువ దాదాపు 3 కోట్ల 93 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. హైడ్రోపోనిక్ గాంజాను స్వాధీనం చేసుకున్న డిఐఆర్ఐ అధికారులు నిందితుడిని అరెస్ట్ చేసి విచారణకు తరలించారు.
ఇక.. హైడ్రోపోనిక్ గాంజా అంటే ఏంటంటే.. సాధారణంగా గంజాయిని నేలపై పెంచుతుంటారు. కానీ, ఈ హైడ్రోపోనిక్ గంజాయిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ల్యాబ్స్‌లో సాగు చేస్తారు. వీటి మొక్కల వేర్లు నీళ్లలో ఉంటాయి. వీటి కోసం ప్రత్యేకమైన వాతావరణాన్ని కృత్రిమంగా ఏర్పాటు చేసి, పెంచుతారు. ఈ రకం గంజాయిని పెంపకానికి ఖర్చు కూడా ఎక్కువ ఉండటంతో.. ధర కూడా లక్షల్లో ఉంటుంది.
ఈ పద్ధతిలో గంజాయి మొక్కను పూర్తిగా పెంచడానికి ఆరు నెలల నుంచి ఏడాది సమయం పడుతుంది. ఎక్కువగా బ్యాంకాక్, ఇతర దేశాల నుంచి మన దేశంలోని చెన్నై, బెంగళూరుతో పాటు హైదరాబాద్‌కు తీసుకువస్తూ ఎయిర్‌పోర్ట్స్‌లో ఎక్కువగా పట్టుబడుతున్నారు.
