40 డిగ్రీల వేడిలో పిల్లల పని
రోజుకు 13 గంటలు అక్కడే
మూడేండ్ల వయసులోనే మైన్లలోకి
వారం కష్టపడితే వచ్చేది డాలర్కంటే తక్కువే
మడగాస్కర్లో చిన్నారుల దుస్థితి
పుస్తకాలు పట్టుకొని బడికెళ్లాల్సిన పిల్లలు. మూడేండ్ల ప్రాయం నుంచే పని చేయడం మొదలు పెడుతున్నారు. బాల కార్మికులుగా మారి చెమటోడుస్తున్నారు. చిట్టి చేతులతో రోజుకు 13 గంటలు గనుల్లో పని చేస్తున్నారు. 40 డిగ్రీల వేడిలో మైకాను వెదుకుతున్నారు. కడుపు నిండా తిండి కాదు.. సగం కడుపునైనా నింపుకుందామని. నలుగురుండే ఫ్యామిలీ వారం కష్టపడితే ఒక్క డాలర్ కన్నా తక్కువ ఇస్తుంటే సగం కడుపుకన్నా తింటున్నరో లేదో. ఆఫ్రికా దేశం మడగాస్కర్‌లోని పిల్లల దుస్థితి ఇది.
మైకా.. కార్లు, ఫోన్లు, పవర్ ప్లేన్లు మొదలుకుని పెయింట్స్, కాస్మెటిక్స్, థర్మల్ ఇన్సూలేషన్ వరకూ వాడే ఖనిజం. ఇలాంటి మైకా గనులు మస్తుగ ఉండే మడగాస్కర్లో పెద్దవారే కాదు చిన్న పిల్లలతో కూడా పని చేయిస్తున్నారు. డెలికేట్‌గా ఉండే మైకాను హ్యాండిల్ చేయడానికి వారి చిన్ని చేతులే సరిపోతాయని మైన్లలో పని చేసే ఫోర్‌మన్లు పిల్లలను పనిలో పెట్టుకుంటున్నారు. రోజుకు కనీసం 13 గంటలు 40 సెంటీగ్రేడ్ల టెంపరేచర్లో చిన్నారులు పనిచేస్తున్నారు. మడగాస్కర్‌లోని ఈ పరిస్థితులను ఇంటర్నేషనల్ టీవీ న్యూస్ చానెల్ ఎన్బీసీ న్యూస్ ప్రపంచానికి తెలియజేసింది. ఆ చానెల్ ప్రతినిథి సింథియా మెక్ఫడ్డెన్ అక్కడికి వెళ్లి స్వయంగా అక్కడి పరిస్థితులు వెలుగులోకి తెచ్చారు. నెదర్లాండ్స్‌కు చెందిన చైల్డ్ రైట్స్ ఎన్జీవో టెర్రె డెస్ హోమెస్తే తరపున పని చేసే ధంగమ్ పొన్పాండీ మడగాస్కర్లో బాలల పరిస్థితులపై సమాచారం ఇవ్వడంతో ఆమె అక్కడికి వెళ్లారు.
బతకడం కోసం పోరాటం
మెక్ఫడ్డెన్ తన టీమ్‌తో మడగాస్కర్ చేరుకున్నారు. ఆ ప్రాంతం రిమోట్ ఏరియా. పేదరికంలో మగ్గిపోతున్నది. బతకడం కోసం జనం రాత్రి, పగలు కూడా కష్టపడుతున్నారు. ఓ తల్లి, ఆమె నలుగురు పిల్లల(అంతా ఐదేండ్ల లోపు వారే)ను మెక్ఫడ్డెన్ కలిశారు. ఫ్యామిలీలో అందరూ అదే పనిచేస్తున్నారు. పాకే దశలో ఉన్న బేబీ తప్ప. ఆ ఐదుగురు కప్పు అన్నమే రోజంతా షేర్ చేసుకోవాలి. ఆ ఫ్యామిలీ రోజూ ఉదయం 5 నుంచి సాయంత్రం 6 వరకూ పని చేస్తుంది. అంతా కష్టపడితే ఆ ఫ్యామిలీకి వారానికి 3 డాలర్ల కన్నా తక్కువే ఇస్తారు. ‘‘40 డిగ్రీల వేడిలో పిల్లలను పక్కనే పెట్టుకుని ఆ తల్లి పని చేస్తోంది. కనీసం నిలువ నీడ కూడా లేదు”అని మెక్ఫడ్డెన్ పేర్కొన్నారు. ఇదంతా షూట్ చేస్తున్న దశలో కొందరు ఆమెను అక్కడి నుంచి వెళ్లిపోవాలని బెదిరింపులకు దిగారు. దాంతో అక్కడే ఈ స్టోరీ కంప్లీట్ చేసి ఆమె వెనుదిరిగారు.
జనమే తిరగబడాలి
“ఈ స్టోరీ నా బుర్రను తొలిచేసింది. ఎంతో కోపం తెప్పించింది. మడగాస్కర్లో మైనింగ్ ప్రాసెస్ చేసి షిప్పింగ్ చేసే కంపెనీలకూ ఇదంతా తెలుసు. కానీ తామేం చేయలేమని వారు మాతో చెప్పారు. ఈ స్టోరీ చూశాక జనమే ఈ కంపెనీలను క్లోజ్ చేయాలని డిమాండ్ చేస్తారని నేను భావిస్తున్నా”
-మెక్ ఫడ్డెన్, మీడియా ప్రతినిధి
