- రూ.2 లక్షలకు బేరం.. రూ.50 వేలు అడ్వాన్సు
- చిన్నాన్న సాయంతో బయటపడ్డ బాలికా వధువు
వరకట్నాల గురించి మనం వినే ఉంటాం. అయితే ఎప్పుడో కాల గర్భంలో కలిసిపోయిన కన్యాశుల్కానికి మళ్లీ బీజం వేసిందో తల్లీ. రూ.2 లక్షలకు కన్నబిడ్డనే బేరం పెట్టింది. రూ.50 వేలు అడ్వాన్సుగా తీసుకొని 14 ఏళ్ల చిన్నారిని 54 ఏళ్ల వ్యక్తికిచ్చి వివాహం జరిపించింది.
అభం శుభం ఎరుగని ఆ చిన్నారి పెళ్లికూతురిగా మారింది. వరుడి వేధింపులు భరించలేక చిన్నాన్న సాయంతో బయటపడింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఉదంతం వెనుక వివరాలివి.
అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలో 8వ తరగతి చదువుతున్న బాలికను కర్ణాటక రాష్ట్రం రాయల్పాడుకు చెందిన రాజశేఖర్(54) అనే వ్యక్తికిచ్చి పది రోజుల క్రితం వివాహం జరిపిం చారు. బాలిక తల్లిదండ్రులు ఘర్షణ పడి కొన్నేళ్లుగా దూరంగా ఉంటున్నారు. తండ్రికి తెలియకుండా తల్లికి ఎదురుకట్నం ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకుని ఇదంతా జరిపించారు.
వివాహం అనంతరం వరుడి వేధింపులు తాళలేక బాలికా వధువు చిన్నాన్నకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. అతను సోమవారం పోలీసులకు విషయం చెప్పడంతో వారి సాయంతో బాలిక.. తండ్రి చెంతకు చేరింది. వీరికి ముగ్గురు కుమార్తెలు కాగా పెద్దకుమార్తెకు తల్లి వివాహం చేసిందని తండ్రి, బంధువులు చెబుతున్నారు. అన్ని అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
