కరోనా వ్యాప్తికి చైనా గోప్యత, మోసమే కారణం

కరోనా వ్యాప్తికి చైనా గోప్యత, మోసమే కారణం

డ్రాగన్‌పై ట్రంప్ మండిపాటు

వాషింగ్టన్ డీసీ: ప్రపంచ అంతటా కరోనా మహమ్మారి వ్యాప్తి చెందడానికి చైనానే కారణమని పలు మార్లు విమర్శించిన అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మరోమారు డ్రాగన్‌పై అటాక్ చేశారు. చైనా నుంచి వైరస్ దాడి చేయనంత వరకు తమ దేశం అద్భుతంగా ఉందని 244వ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ట్రంప్ చెప్పారు. ‘ఇన్నాళ్లుగా యూఎస్ నుంచి లబ్ధి పొందిన ఫారెన్ ల్యాండ్స్‌పై ట్యారిఫ్స్‌ విధించడం ప్రారంభించాం. దీని ద్వారా మునుపెన్నడూ లేని రీతిలో అద్భుతమైన ట్రేడ్ డీల్స్‌ చేసుకోగలిగాం. ఆయా దేశాలు బిలియన్ల కొద్దీ డాలర్లను యూఎస్ ట్రెజరీకి చెల్లిస్తున్న తరుణంలో చైనా నుంచి వచ్చిన వైరస్ మనపై దాడికి దిగింది. మనం గౌన్లు, మాస్కులు, సర్జికల్ ఎక్విప్‌మెంట్‌లను తయారు చేస్తున్నాం. వీటిని విదేశీ గడ్డలోనూ రూపొందిస్తున్నారు. ముఖ్యంగా వైరస్ వచ్చిన చైనాలో వీటిని తయారు చేస్తున్నారు’ అని ట్రంప్ పేర్కొన్నారు.

‘చైనా గోప్యత, మోసాల వల్లే వైరస్ ప్రపంచం అంతటా వ్యాపించింది. దీనికి పూర్తి జవాబుదారీతనం చైనాదే. వ్యాక్సిన్ పరిశోధన విషయంలో మనం నమ్మశక్యం కాని విధంగా చాలా బాగా పని చేస్తున్నాం. అందుకు దేశంలోని సైంటిస్టులు, రీసెర్చర్స్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మన జీవితాలను కాపాడే వ్యాక్సిన్‌ను వేగంగా రూపొందించడం కోసం వారు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ఏడాది ముగిసేలోపే వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు యూఎస్‌లో 40 మిలియన్‌ల టెస్టులు చేశాం. వేరే ఏ ఇతర దేశంలోనూ ఇన్ని టెస్టులు నిర్వహించలేదు. అందుకే ఏ దేశమూ టెస్టుల సంఖ్యను  వెల్లడించడం లేదు. మనకు టెస్టింగ్స్‌ చేపట్టడానికి కావాల్సిన అత్యద్భుత ఫెసిలిటీస్‌ ఉన్నాయి’ అని అగ్రరాజ్య అధినేత వివరించారు.