కరోనా మృతుల లెక్కలు పెంచిన చైనా

కరోనా మృతుల లెక్కలు పెంచిన చైనా
  •   ఒక్కసారిగా వుహాన్ లో 50%, దేశంలో 39% పెరిగిన మృతులు

బీజింగ్: చైనాలో కరోనా మృతుల లెక్కను చైనా ఒక్కసారిగా పెంచేసింది. మృతుల లెక్కను వుహాన్​లో 50 శాతం, దేశం మొత్తంలో 30 శాతం పెంచింది. దేశవ్యాప్తంగా మరణాల సంఖ్య 4,632కు, కేసుల సంఖ్య 82,692కు పెరిగింది.  వైరస్ వల్ల చనిపోయినోళ్ల లెక్కను ఆ దేశం తక్కువ చేసి చూపుతోందంటూ అమెరికా, బ్రిటన్ తదితర దేశాలు విమర్శలు చేశాయి. గురువారం నాటికి వుహాన్ లో కేసులు 325 పెరిగి, 50,333కు చేరాయి. ఒక్క వుహాన్ లోనే మరో 1,290 మంది మరణించినట్లు లెక్కలను సవరించడంతో, ఇక్కడ మొత్తం మరణాల సంఖ్య 3,869కి చేరింది. చట్టం, రూల్స్​కు అనుగుణంగా,  వైరస్​సోకినవారి పట్ల బాధ్యతతో కరోనా కేసులు, మరణాల లెక్కను సవరిస్తున్నట్లు వుహాన్ మున్సిపల్ హెడ్ క్వార్టర్స్ ఒక నోటిఫికేషన్ లో వెల్లడించింది. అయితే, తాము కరోనా కేసులు, మరణాల లెక్కలను తక్కువ చేసి చూపలేదని, ఆ లెక్కలన్నీ పారదర్శకంగా, కచ్చితంగానే  ఉన్నాయని చైనా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. కొందరు పేషెంట్లు ఇండ్ల  దగ్గరే చనిపోయారని, కొన్ని తప్పుడు రిపోర్టుల వల్ల కేసులు సోకినవారి వివరాలు రిపీట్ అయ్యాయని, ఇవన్నీ సరిచూసుకునేందుకు ఆలస్యం అయిందని వివరించింది.

చైనా ఎకానమీ కుదేలు

కరోనా విపత్తు వల్ల చైనా ఆర్థికవ్యవస్థ భారీగా పతనమైంది. చైనా ఎకానమీ 1992 తర్వాత ఇంత భారీగా దిగజారడం ఇదే మొదటిసారి. దేశ ఆర్థిక పరిస్థితిపై శుక్రవారం ప్రెసిడెంట్ జీ జిన్ పింగ్ పొలిట్ బ్యూరో సమావేశం నిర్వహించారు. వీలైనంత మేరకు లిక్విడిటీని అందుబాటులో ఉంచడం, రిజర్వ్ బ్యాంకు ఉంచుకునే నిల్వలను తగ్గించడం వంటి చర్యలు చేపట్టాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్లు మీడియా వెల్లడించింది.