
లోక్‌సభ ఎన్నికలు ముగిశాక కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే.. తాను జైలు నుంచి వెంటనే విడుదలవుతానని చెప్పారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. మే 13వ తేదీ సోమవారం ఢిల్లీలో ఆప్ పార్టీ కౌన్సిలర్‌లతో కేజ్రీవాల్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.., ఇటీవల తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం అద్భుతం ఏమీ కాదని, దేవుడి దయతోనే తనకు 20 రోజుల పాటు బయట ఉండడానికి బెయిల్ వచ్చిందని చెప్పారు.
మా పని కారణంగా ఆప్ నాయకులను ప్రజలు గౌరవిస్తారని.. ప్రేమిస్తారని కేజ్రీవాల్ అన్నారు. జూన్ 2న మళ్లీ జైలుకు వెళ్లాలని.. జూన్ 4న జైల్లోనే ఎన్నికల ఫలితాలను చూస్తూ ఉంటానని.. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే జూన్ 5న మళ్లీ జైలు నుంచి బయటకు వస్తానని పార్టీ కౌన్సిలర్లకు కేజ్రీవాల్ ధైర్యం చెప్పారు.
"నన్ను జైలులో పెట్టిన తర్వాత మీ ఆత్మ నా మనోధైర్యాన్ని పెంచింది. మమ్మల్ని విచ్ఛిన్నం చేసేందుకు చాలా ప్రయత్నించారు కానీ మీరు ఎక్కడికీ వెళ్లలేదు. ఇతర పార్టీలకు మీరే ఆదర్శం...జైలులో నన్ను అంతమొందించేందుకు శాయశక్తులా ప్రయత్నించారు... ఒక్కోసారి నన్ను అవమానించేవారు, 5 రోజులుగా ఇన్సులిన్ కూడా ఇవ్వలేదు. నేను డయాబెటీస్ పేషెంట్‌ని... ఇన్సులిన్ ఇవ్వండి, ఇన్సులిన్ ఇవ్వండి అని డాక్టర్‌తో పదే పదే చెప్పినా పట్టించుకోలేదు’’ అని కేజ్రీవాల్ తెలిపారు.
తీహార్ జైలులోని తన సెల్‌లో రెండు సిసిటివి కెమెరాలు ఉన్నాయని, ఎప్పటికప్పుడు 13 మంది అధికారులు పర్యవేక్షించారని తెలిపారు. పీఎంఓకు సీసీటీవీ ఫీడ్‌ను కూడా అందించారని చెప్పారు. మోదీ, జైలులో తనను పర్యవేక్షిస్తున్నారని.. మోదీకి తనపై ఎలాంటి ద్వేషం ఉందో తనకు తెలియదు’’ అని అన్నారు.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన కేజ్రీవాల్‌కు లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం జూన్ 1 వరకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూన్ 2న కేజ్రీవాల్ తిరిగి జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. ఏడు దశల ఎన్నికలకు జూన్ 1 చివరి రోజు కాగా జూన్ 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.