ఎక్సైజ్​ సీఐ కొడుకు ర్యాష్​ డ్రైవింగ్..​ కాజీపేటలో కారు ఢీకొని మహిళ మృతి

ఎక్సైజ్​ సీఐ కొడుకు ర్యాష్​ డ్రైవింగ్..​ కాజీపేటలో కారు ఢీకొని మహిళ మృతి
  • ఓటేసి బైక్ ​ఎక్కుతున్న మహిళ మృతి
  • కొంతదూరం ఈడ్చుకెళ్లిన కారు 
  • ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మృతురాలి కుటుంబసభ్యుల ఫైర్​ 
  • కాజీపేటలోని ఫాతిమానగర్ బ్రిడ్జిపై ​ఆందోళన

కాజీపేట, వెలుగు: కారును ఓవర్​ స్పీడ్ గా నడుపుకుంటూ వచ్చిన ఓ ఎక్సైజ్​ సీఐ కొడుకు ఓటేసి వచ్చి బైక్​ ఎక్కుతున్న మహిళను ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను దవాఖానకు తరలిస్తుండగా చనిపోయింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ బాధిత కుటుంబ సభ్యులు రోడ్డెక్కారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం...దర్గా కాజీపేట శౌరినగర్​లో ఉండే గాదె కవిత(39) హనుమకొండలోని ఓ ప్రైవేటు హాస్పిటల్​లో స్టాఫ్​నర్సు. ఎన్నికల్లో ఓటు వేసేందుకు తన భర్త జోసెఫ్​రెడ్డితో కలిసి ఫాతిమానగర్​ సెయింట్​గాబ్రియల్ స్కూల్​ కు గురువారం ఉదయం 10 గంటలకు వచ్చింది. ఓటేసిన తర్వాత 11.15 గంటల ప్రాంతంలో బయటకు వచ్చింది. అక్కడి నుంచి ఇంటికి వెళ్లేందుకు బైక్​ఎక్కుతుండగా..హైదరాబాద్​లో ఎక్సైజ్ సీఐగా పని చేస్తున్న శరత్ కొడుకు వంశీ భార్గవ్​ కారులో కాజీపేట నుంచి దర్గా వైపు వేగంగా వస్తూ  కవితను ఢీకొట్టాడు. ఓవర్​స్పీడ్​గా నడపడం, కారు కంట్రోల్ ​కాకపోవడంతో కొంతదూరం అలాగే ఈడ్చుకెళ్లాడు. దీంతో కవితకు తలకు తీవ్ర గాయమైంది. 108లో  దవాఖానకు తరలిస్తుండగా చనిపోయింది. మృతదేహాన్ని వరంగల్​ఎంజీఎం మార్చురీకి తరలించారు. మృతురాలికి ఇద్దరు కూతుళ్లున్నారు.

రోడ్డెక్కిన మృతురాలి కుటుంబసభ్యులు 

వరంగల్​ఎల్లంబజార్​కు చెందిన వంశీభార్గవ్​రెండు రోజుల్లో ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లనున్నట్లు తెలిసింది. ఈయన తండ్రి శరత్​కుమార్​ హైదరాబాద్​లో ఎక్సైజ్​ సీఐ కావడం, కేసు నమోదైతే విదేశాలకు వెళ్లేందుకు ఇబ్బందులు తలెత్తుతాయనే ఉద్దేశంతో పోలీసులు కేసు నమోదు చేయడం లేదంటూ బాధిత కుటుంబ సభ్యులు కాజీపేట స్టేషన్​ఎదుట ఆందోళనకు దిగారు. స్పందన లేకపోవడంతో ఫాతిమానగర్​ బ్రిడ్జి వద్దకు వెళ్లి బైఠాయించారు. దీంతో వరంగల్–-హైదరాబాద్​ హైవేపై వాహనాలు నిలిచిపోయాయి. రెండు గంటల పాటు రాస్తారోకో చేయగా, భారీగా ట్రాఫిక్​ జామైంది. కాజీపేట పోలీసులు వచ్చి సర్దిచెప్పే ప్రయత్నం చేయగా బాధిత కుటుంబ సభ్యులు పోలీసులతో వాదనకు దిగారు. విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విమరించారు. సీఐ సార్ల రాజును వివరణ కోరగా.. తాను ఎలక్షన్​డ్యూటీలో ఉండగా హెడ్​కానిస్టేబుల్​సక్రమ్​ కేసు నమోదు చేశాడని, నిందితుడు దొడ్ల వంశీ భార్గవ్​ను రిమాండ్ కు తరలించినట్లు వివరించారు.