IPL 2024: డేవిడ్ వార్నర్ 70 శాతం భారతీయుడు: ఆస్ట్రేలియా క్రికెటర్

IPL 2024: డేవిడ్ వార్నర్ 70 శాతం భారతీయుడు: ఆస్ట్రేలియా క్రికెటర్

ఆసీస్ విధ్వంసకర ఓపెనర్, ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ డేవిడ్ వార్నర్‌ తెలుగు క్రికెట్ అభిమానులకు బాగానే సుపరిచితుడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టును ఛాంపియన్‌గా నిలిపిన కెప్టెన్‌గావార్నర్‌.. తన సోషల్ మీడియా పిచ్చితో ఎనలేని పాపులారిటీ సంపాదించాడు. తెలుగు సినిమాలకు సంబంధించిన పాటలు, డైలాగులకు తన నటనా నైపుణ్యాన్ని జోడించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవాడు. అలా ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ భారతీయులకు, అందునా తెలుగు వారికి బాగా దగ్గరయ్యాడు. ఈ క్రమంలో డేవిడ్ వార్నర్‌పై ఢిల్లీ జట్టు సహచరుడు జేక్‌ ఫ్రేజర్‌ మెక్‌గుర్క్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.  

అనుభవజ్ఞుడైన తన సహచరుడు వార్నర్‌.. ఆస్ట్రేలియన్ కంటే భారతీయుడిలా ఎక్కువ కనిపిస్తాడని జేక్‌ ఫ్రేజర్‌ వెల్లడించాడు. అతను 70 శాతం భారతీయుడైతే.. 30 శాతం ఆస్ట్రేలియన్ అని తెలిపాడు. అంతేకాదు వార్నర్‌ నిస్వార్థ ఆటగాడని, ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సాయం చేసేందుకు సిద్ధంగా ఉంటాడని కొనియాడాడు. తొలిరోజుల్లో వార్నర్‌ చాలా పొడవుగా ఉంటాడని ఊహించుకున్నానని కానీ, అంత ఎత్తు లేడని చమత్కరించాడు. అయితే, అతని మనసు చాలా గొప్పదని జేక్‌ కితాబిచ్చాడు. పోడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ ఫ్రేజర్ ఈ వ్యాఖ్యలు చేశాడు.

ఐపీఎల్ 2024లో విఫలం

ఐపీఎల్ 2024 సీజన్‌లో వార్నర్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. ఇప్పటివరకూ ఆడిన 7 మ్యాచ్‌లలో 167 పరుగులు మాత్రమే సాధించాడు. అతని పేలవ ప్రదర్శన ఢిల్లీ విజయాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఇక14 ఏళ్లుగా ఐపీఎల్ ఆడుతున్న వార్నర్.. అత్యంత విజయవంతమైన ఓవర్సీస్ బ్యాటర్. 183 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 6564 పరుగులు చేశాడు. 2016లో SRH కెప్టెన్‌గా IPL ట్రోఫీ అందించాడు.